లక్నో: సమష్టి ప్రదర్శనతో అదరగొడుతూ... అంచనాలకు మించి రాణిస్తూ... వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అఫ్గానిస్తాన్ నాలుగో విజయం నమోదు చేసింది. ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన మూడు జట్లపై సంచలన విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్ తాజాగా నెదర్లాండ్స్ జట్టును ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ (86 బంతు ల్లో 58; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మ్యాక్స్ ఓ డౌడ్ (40 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నబీ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలిచింది. రహ్మత్ షా (54 బంతుల్లో 52; 8 ఫోర్లు), కెపె్టన్ హష్మతుల్లా (64 బంతు ల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.
డచ్ రనౌట్...
నెదర్లాండ్స్ జట్టులో టాప్–5లో ఒక్క ఓపెనర్ వెస్లీ (1) మినహా... తర్వాత వరుసగా నలుగురు బ్యాటర్లు మ్యాక్స్ ఓ డౌడ్, అకెర్మన్ (35 బంతుల్లో 29; 4 ఫోర్లు), సైబ్రాండ్, కెపె్టన్ ఎడ్వర్డ్స్ (0) రనౌట్ కావడమే డచ్ కొంపముంచింది. వన్డేల్లో ఒక జట్టు తరఫున టాప్–5లో నలుగురు రనౌట్ కావ డం ఇదే ప్రథమం. సమన్వయలోపం, పరుగేలేని చోట ప్రయత్నించి భంగపడటంతో నెదర్లాండ్స్ కష్టాలు కొనితెచ్చుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.
గెలిపించిన రహ్మత్, హష్మతుల్లా
సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్ల వైఫల్యం కంగారుపెట్టింది. రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (20) నిరాశపరిచారు. ఈ దశలో రహ్మత్ షా, కెపె్టన్ హష్మతుల్లా ఇన్నింగ్స్ నడిపించి, గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో రహ్మత్ షా (47 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్‌కు 74 పరుగులు జోడించాక జుల్ఫికర్ బౌలింగ్‌లో రహ్మత్‌షా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన అజ్మతుల్లా (31 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేసిన హష్మతుల్లా జట్టును విజయతీరానికి చేర్చాడు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా...
అఫ్గాన్ ఏదో గాలివాటం గెలుపులేమీ గెలవలేదు. చక్కని బౌలింగ్, నిలకడైన బ్యాటింగ్‌తో మాజీ చాంపియన్లను ఓడించి 8 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఇప్పటివరకైతే బానే ఉంది. కానీ హష్మతుల్లా జట్టుకు మిగిలినవి రెండు మ్యాచ్‌లే! అవి కూడా గట్టి ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా (7న ముంబైలో), దక్షిణాఫ్రికా (10న అహ్మదాబాద్‌లో)లతో కావడంతో... సెమీస్ చేరడం, కల సాకారమవడం మాత్రం అంత సులభమైతే కాదు. అయితే సంచలనాల మజా ఆఖరి దశను రసవత్తరం చేస్తే మాత్రం... 2003లో కెన్యా సెమీస్ చేరినట్లే... అఫ్గాన్‌కు ఆ అవకాశం దక్కినా దక్కొచ్చు!
స్కోరు వివరాలు
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 1; మ్యాక్స్ ఓ డౌడ్ (రనౌట్) 42; అకెర్మన్ (రనౌట్) 29; సైబ్రాండ్ (రనౌట్) 58; ఎడ్వర్డ్స్ (రనౌట్) 0; బస్ డి లీడే (సి) ఇక్రామ్ (బి) నబీ 3; జుల్ఫీకర్ (సి) ఇక్రామ్ (బి) నూర్ అహ్మద్ 3; వాన్ బిక్ (స్టంప్డ్) ఇక్రామ్ (బి) నబీ 2; వాన్‌డెర్ మెర్వ్ (సి) జద్రాన్ (బి) నూర్ అహ్మద్ 11; ఆర్యన్ దత్ (నాటౌట్) 10; మీకెరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 4; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–3, 2–73, 3–92, 4–92, 5–97, 6–113, 7–134, 8–152, 9–169, 10–179. బౌలింగ్: ముజీబ్ 10–0–40–1, ఫరూఖీ 5–0–36–0, ఒమర్జాయ్ 3–0–11–0, నబీ 9.3–1–28–3, రషీద్ ఖాన్ 10–0–31–0, నూర్ అహ్మద్ 9–0–31–2.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 10; జద్రాన్ (బి) వాన్‌డెర్ మెర్వ్ 20; రహ్మత్ షా (సి అండ్ బి) జుల్ఫికర్ 52; హష్మతుల్లా (నాటౌట్) 56; అజ్మతుల్లా (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (31.3 ఓవర్లలో 3 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–27, 2–55, 3–129. బౌలింగ్: ఆర్యన్ దత్ 8.3–0–49–0, వాన్ బిక్ 7–0–30–1, మీకెరన్ 5–0–35–0, వాన్‌డెర్ మెర్వ్ 5–0–27–1, జుల్ఫికర్ 3–0–25–1, అకెర్మన్ 3–0–12–0.
ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X పాకిస్తాన్
వేదిక: బెంగళూరు
ఉదయం గం. 10:30 నుంచి
ఆ్రస్టేలియా Xఇంగ్లండ్
వేదిక: అహ్మదాబాద్
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment