హష్మతుల్లా షాహిది (PC: ICC)
ICC WC 2023- Afg Vs Ned- Hashmatullah Shahidi: ‘‘ఈరోజు మా బౌలర్లు రాణించారు. బ్యాట్‌తోనూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాం. లక్ష్యాన్ని ఛేదించాం. ఈ టోర్నీలో ఛేజింగ్‌లో విజయవంతం కావడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక మహ్మద్ నబీ గురించి చెప్పేదేముంది. అతడు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు.
ఎప్పుడూ ఇలాగే..
జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ పట్టుదలగా నిలబడతాడు. మేమంతా సమిష్టి కృషితో ఇక్కడి దాకా చేరుకున్నాం. ప్రతీ గెలుపును పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒకవేళ మేము గనుక ఆ ఫీట్ సాధిస్తే అంతకంటే పెద్ద విషయం మరొకటి ఉండదు’’ అని అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నాడు.
సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నాం
వన్డే వరల్డ్‌కప్-2023లో జట్టు సాధిస్తున్న విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నామంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇలాగే ముందుకు సాగి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నామని తెలిపాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో అఫ్గన్ జట్టు నాలుగో గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే మూడు మాజీ చాంపియన్లను ఓడించిన హష్మతుల్లా బృందం శుక్రవారం నాటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.
స్పిన్నర్ల ధాటికి
అఫ్గన్ బౌలర్ల ధాటికి 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కీలక సమయంలో రనౌట్ల కారణంగా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అఫ్గన్ స్పిన్నర్లు మహ్మద్ నబీ మూడు, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒకటి, నూర్ అహ్మద్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గన్‌ను డచ్ బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(10), ఇబ్రహీం జద్రాన్(20)లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు.
హష్మతుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(52) అర్ద శతకం సాధించాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 56, అజ్మతుల్లా ఒమర్జాయ్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి అఫ్గన్‌కు విజయం అందించారు.
ఈ ముగ్గురు రాణించడంతో 31.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించిన అఫ్గనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగపరచుకుంది.
ఈ నేపథ్యంలో కెప్టెన్ హష్మతుల్లా మాట్లాడుతూ.. ఈసారి తాము కచ్చితంగా సెమీ ఫైనల్ రేసులో నిలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల క్రితం మా అమ్మను కోల్పోయాం.
మా కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మా దేశానికి చెందిన చాలా మంది శరణార్థులు బతుకుపోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల బాధను మేము అర్థం చేసుకోగలం. ఈ రోజు ఈ విజయాన్ని వాళ్లకు అంకితం చేస్తున్నాం’’ అని హష్మతుల్లా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment