వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టీమ్‌ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ | Ajay Jadeja Appointed As Afghanistan Team Mentor For ICC Cricket ODI World Cup 2023, Deets Inside - Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ టీమ్‌ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌

Published Mon, Oct 2 2023 4:32 PM | Last Updated on Mon, Oct 2 2023 6:02 PM

Ajay Jadeja Appointed As Afghanistan Team Mentor For ICC Cricket World Cup 2023 - Sakshi

త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ మెంటార్‌గా టీమిండియా మాజీ కెప్టెన్‌ అజయ్‌ జడేజా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు జడేజాతో ఒప్పందం కుదుర్చుకుంది. 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్‌ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో అంతగా ప్రభావం చూపని ఈ గుజరాత్‌ ఆల్‌రౌండర్‌, వన్డేల్లో అద్భుతంగా రాణించాడు.

15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే జడేజా ధాటిగా ఆడటంలో సిద్ధహస్తుడు. తమ జమానాలో జడేజా ఎంతటి బౌలింగ్‌లోనైనా అలవోకగా సిక్సర్లు బాదేవాడు. 1996 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జడేజా 25 బంతుల్లో 45 పరుగులు చేసి, నాటి అరివీర భయంకరుడైన ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌కు ముచ్చెమటలు పట్టించారు.

మీడియం పేస్‌ బౌలర్‌గానూ అడపాదడపా రాణించిన జడేజా వన్డేల్లో 20 వికెట్లు పడగొట్టాడు. జడేజాకు అంతర్జాతీయ వన్డేలతో పాటు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. జడేజా 111 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 20 సెంచరీలు, 40 అర్ధసెంచరీల సాయంతో 8100 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్‌ 264 పరుగులుగా ఉంది. ఈ ఫార్మాట్‌లో జడేజా 54 వికెట్లు కూడా పడగొట్టాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 291 మ్యాచ్‌లు ఆడిన జడేజా 11 సెంచరీలు, 48 హాఫ్‌ సెంచరీల సాయంతో 8304 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను 49 వికెట్లు పడగొట్టాడు. జడేజా పుట్టింది గుజరాత్‌లో అయినా దేశవాలీ క్రికెట్‌ మాత్రం ఎక్కువగా హర్యానాకు ఆడాడు. జడేజా హర్యానాతో పాటు జమ్మూ అండ్‌ కశ్మీర్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. 

ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జర్నీ అక్టోబర్‌ 7న బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌ అక్టోబర్‌ 11న టీమిండియాతో తలపడుతుంది. అక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌లో వరల్డ్‌కప్‌ ప్రారంభమవుతుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 14న జరుగనుంది. వరల్డ్‌కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ను ఢీకొంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement