![Allah Ghazanfar takes 6 to guide Afghanistan to a massive win](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/7/AFG-vs-BAN.jpg.webp?itok=KlYhfual)
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు...బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.
ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 84; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా... కెపె్టన్ హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 52; 2 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. గుర్బాజ్ (5), రహమత్ షా (2), అజ్మతుల్లా (0) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్, తస్కిన్ అహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా మొహమ్మద్ ఘజన్‌ఫర్ 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజుమల్ హోస్సేన్ షాంటో (68 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ నిలిచాడు. సౌమ్య సర్కార్ (33), మిరాజ్ (28) మినహా ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తంజీద్ హసన్ (3), మహ్ముదుల్లా (2), ముష్పికర్ (1), రిషాద్ (1), తౌహిద్ (11) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.
చదవండి: టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్
Comments
Please login to add a commentAdd a comment