వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే.. అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అఫ్గనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత తాను వన్డేల నుంచి తప్పుకొంటానని తెలిపాడు. కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన అఫ్గనిస్తాన్.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.
హ్యాట్రిక్ విజయాలు
తద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా మూడో సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నాటి ఆఖరి వన్డేలో అఫ్గన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
మహ్ముదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
రహమానుల్లా గుర్బాజ్ సూపర్ సెంచరీ
ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (120 బంతుల్లో 101; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ పూర్తి చేసుకోగా... అజ్మతుల్లా (77 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివర్లో మొహమ్మద్ నబీ (34 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు.
బంగ్లా బౌలర్లలో నహీద్ రాణా, ముస్తఫిజుర్ రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అజ్మతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మొహమ్మద్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటా
ఈ నేపథ్యంలో నబీ మాట్లాడుతూ.. ‘‘‘గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నా. కానీ మా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. దీంతో ఆ టోర్నీ ఆడాలనుకున్నా.
అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటా’ అంటూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా సుదీర్ఘ కాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న 39 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను అభిమానులు అఫ్గన్ క్రికెట్ హీరోగా పిలుచుకుంటారు.
ఇక అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 167 వన్డేలు ఆడిన నబీ... 27.48 సగటుతో 3,600 పరుగులు చేయడంతో పాటు 172 వికెట్లు పడగొట్టాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నబీ... 2 సెంచరీలు, 17 అర్ధశతకాలు తన పేరిట రాసుకున్నాడు.
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన అఫ్గనిస్తాన్ జట్టు... ఆరో స్థానంలో నిలవడం ద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment