తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 68 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ షంటో (119 బంతుల్లో 76; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ నమోదు చేయగా... సౌమ్య సర్కార్ (35), జాకీర్ అలీ (37 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), నసుమ్ అహ్మద్ (25; ఒక ఫోర్, రెండు సిక్సర్లు) రాణించారు.
తన్జిద్ హసన్ (22), మెహది హసన్ మిరాజ్ (22) కూడా ఫర్వాలేదనిపించారు అఫ్గాన్ బౌలర్లలో నంగెయాలియా ఖరోటె 3, రషీద్ ఖాన్ ఘజన్‌ఫర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది.
రహమత్ షా (76 బంతుల్లో 52; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా... సెదిఖుల్లా అటల్ (39; 5 ఫోర్లు), గుల్బదిన్ నైబ్ (26; 4 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చిన అఫ్గాన్ బ్యాటర్లు ఈ సారి అదే జోష్ కొనసాగించలేకపోయారు.
రహామనుల్లా గుర్బాజ్ (2), అజ్మతుల్లా (0), హష్మతుల్లా (17), మొహమ్మద్ నబీ (17), రషీద్ ఖాన్ (14) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నసుమ్ అహ్మద్ 3... ముస్తఫిజుర్ రహమాన్, మెహదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే సోమవారం ఇక్కడే జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment