Ashes Series 2021: How It Named As Ashes History Interesting Facts Schedule: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న యాషెస్ సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. గబ్బా వేదికగా డిసెంబరు 8న తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ గెలవకపోయినా క్షమిస్తారు గానీ.. యాషెస్‌లో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేరు ఇరు దేశాల అభిమానులు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న యాషెస్ సిరీస్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఉన ప్రత్యేకత ఏమిటి తదితర అంశాలు తెలుసుకుందాం!
1882 నాటి ముచ్చట..
క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అంటారు కదా! అలాంటిది ఇంగ్లండ్‌కు సొంతగడ్డ మీదే ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. 1882 ఆగష్టు 29న ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్.. ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. అంతకు ముందు ఎన్నో మ్యాచ్‌లు ఆడినా... ఇంగ్లండ్‌కు స్వదేశంలో ఆసీస్ చేతిలో ఇదే తొలి ఓటమి. ఈ నేపథ్యంలో స్పోర్టింగ్ టైమ్స్ అనే బ్రిటిష్ పత్రిక ఈ ఘోర అవమానాన్ని అభివర్ణిస్తూ... ‘‘ఇంగ్లండ్ క్రికెట్ చచ్చిపోయింది. శవాన్ని కాల్చేస్తారు.. ఆ బూడిదను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్తారు’’ అంటూ కథనం ప్రచురించింది.
కొన్ని వారాల తర్వాత..
ఈ మ్యాచ్ జరిగిన కొన్ని వారాల తర్వాత.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపికైన ఇవో బ్లిగ్... స్పోర్టింగ్ టైమ్స్ కథనానికి స్పందిస్తూ... ‘‘నేను ఆస్ట్రేలియా నుంచి అదే బూడిద తీసుకొస్తా’’ అని ప్రతిన బూనారు. ఇందుకు కౌంటర్‌గా.. ఆసీస్ సారథి డబ్ల్యూఎల్ మర్డోక్ సైతం.. విజయపరంపర కొనసాగించి తీరతాం అంటూ శపథం చేశారు.
ఇలా సవాళ్లు- ప్రతి సవాళ్ల మధ్య రసవత్తరంగా సాగిన సిరీస్‌లో ఇవో బ్లిగ్‌దే పైచేయి సాధించారు. ఇంగ్లండ్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో తేడాతో గెలిపించి మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర నిరాశ నిస్పృహలు, ఆగ్రహావేశాలకు లోనైన ఆసీస్ అభిమానులు.. ముఖ్యంగా మహిళలు ఆఖరి టెస్టులో వాడిన బెయిల్స్‌ను కాల్చారు. ‘ఇది ఆస్ట్రేలియా క్రికెట్ బూడిద’ అంటూ బ్లిగ్‌కు అందజేశారు. ఒక టెర్రాకోట పాత్రలో ఆ బూడిదను నింపి ఇచ్చారు. అప్పటి నుంచి ఈ పోరుకు యాషెస్‌గా ముద్ర పడింది.
బ్లిగ్ ప్రేమ, పెళ్లి..
ఈ సిరీస్ సందర్భంగానే మెల్‌బోర్న్‌లో... ఇవో బ్లిగ్ తన జీవిత భాగస్వామి ఫ్లోరెన్స్ మార్ఫీని కలుసుకున్నారు. స్నేహం ప్రేమగా మారడంతో 1884 ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక తనకు బహుమతిగా ఇచ్చిన టెర్రాకోట పాత్రను ఇంగ్లండ్‌కు తీసుకువచ్చిన ఇవో బ్లిగ్... దానిని వ్యక్తిగత బహుమతిగా భావించి తన వద్దే పెట్టుకునేవారు. అయితే, బ్లిగ్ చివరి కోరిక మేరకు.. ఆయన మరణించిన తర్వాత ఫ్లోరెన్స్ ఆ పాత్రను మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌కు అందజేశారు.
అసలు బూడిద ఉన్న ట్రోఫీ అక్కడే
అప్పటి నుంచి అసలు బూడిద ఉన్న ఆరంగుళాల యాషెస్ ట్రోఫీ ఇప్పటికీ లార్డ్స్ మ్యూజియంలో ఉంది. ప్రతీ నాలుగేళ్లలో రెండు సార్లు యాషెస్ జరుగుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఒక్కోసారి ఈ మెగా సిరీస్‌కు ఆతిథ్యమిస్తాయి. ఇంతటి.. అతిపురాతమైన ‘వైరానికి’ సంబంధించిన చరిత్ర ఉంది కాబట్టే ఇరు జట్లు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. కెరీర్‌లో ఒక్కసారైనా యాషెస్ ట్రోఫీని ముద్దాడాలనేది ఈ రెండు దేశాల క్రికెటర్ల అతి పెద్ద లక్ష్యం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
అంతేకాదు... ఈ సిరీస్‌లో రాణిస్తే చాలు అప్పటి వరకు జీరోగా ఉన్న క్రికెటర్లు సైతం హీరోలుగా మారిపోతారు! అందుకే సర్వ శక్తులు ఒడ్డి గెలిచేందుకు కృషి చేస్తారు. నిజానికి... యాషెస్ అంటే అర్థం బూడిదే కావచ్చు. కానీ క్రికెట్ ప్రపంచంలో దానికున్న విలువ వెలకట్టలేనిది. క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే ప్రతి ఒక్కరు.. ఈ సిరీస్‌ను ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు సిసలు టెస్టు క్రికెట్ మజాను అందించేది యాషెస్ అనే వారూ లేకపోలేదు. మీరేమంటారు?
యాషెస్ సిరీస్ 2021- షెడ్యూల్:
►మొదటి టెస్టు: డిసెంబరు 08-12: గబ్బా
►రెండో టెస్టు: డిసెంబరు 16-20: అడిలైడ్
►మూడో టెస్టు: డిసెంబరు 26- 30: మెల్‌బోర్న్
►నాలుగో టెస్టు: జనవరి 5-9: సిడ్నీ
►ఐదో టెస్టు: జనవరి 14-18
చదవండి: Ind Vs Sa Test Seires: ప్రొటిస్ జట్టు ఇదే.. పాక్‌కు చుక్కలు చూపించిన బౌలర్ వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment