ఏషియన్ గేమ్స్ 2023 మహిళల క్రికెట్‌లో సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధించిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి.
నిన్న (సెప్టెంబర్ 21) జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ 1, 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ప్రత్యర్ధుల (మలేషియా, ఇండోనేషియా) కంటే మెరుగైన సీడింగ్ ఉన్న కారణంగా భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు అడ్వాన్స్ కాగా.. ఇవాళ (సెప్టెంబర్ 22) జరిగిన క్వార్టర్ ఫైనల్ 3లో శ్రీలంక.. థాయ్‌లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌కు చేరింది.
ఆ తర్వాత జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ 4 కూడా వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో హాంగ్‌కాంగ్ కంటే మెరుగైన సీడింగ్ ఉండటం చేత బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరింది.
థాయ్‌లాండ్‌పై శ్రీలంక విజయం..
క్వార్టర్ ఫైనల్ 3లో థాయ్‌లాండ్‌పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్.. 7 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేయగా.. శ్రీలంక ఆడుతూ పాడుతూ 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చమారీ ఆటపట్టు (27), అనుష్క సంజీవని (32) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి లంకను గెలిపించారు.
సెమీస్‌లో ఎవరెవరు..?
సెప్టెంబర్ 24న జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. తొలి సెమీస్‌లో భారత్-బంగ్లాదేశ్.. రెండో సెమీస్‌లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్..?
సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్, పాక్‌లు తమతమ ప్రత్యర్ధులపై విజయం సాధిస్తే.. ఈ రెండు జట్లు ఫైనల్లో ఎదురెదురుపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 25న గోల్డ్ మెడల్ కోసం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు సెమీస్‌ల్లో ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోసం పోటీపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment