‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి | Athlete Nandini won bronze in the Asian Games | Sakshi
Sakshi News home page

‘నందివర్ధనం’.. పేద కుటుంబం నుంచి వచ్చి.. ‘అవరోధాలు’ అధిగమించి

Published Mon, Oct 2 2023 2:23 AM | Last Updated on Mon, Oct 2 2023 8:07 AM

Athlete Nandini won bronze in the Asian Games - Sakshi

Asian Games 2023: గత కొంత కాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెట్‌ అగసార నందిని అసలు సమయంలో తన ఆటను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొన్న తొలిసారి కాంస్యంతో మెరిసింది.

ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లో నందిని మూడో స్థానంలో నిలిచి కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు ఈవెంట్లలో కలిపి నందిని 5712 పాయింట్లు సాధించింది. హెప్టాథ్లాన్‌లోని తొలి ఆరు ఈవెంట్లు ముగిసేసరికి నందిని ఐదో స్థానంలో నిలిచింది.

2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసి
100 మీటర్ల హర్డిల్స్‌ (4వ స్థానం), హైజంప్‌ (9వ స్థానం), షాట్‌పుట్‌ (8వ స్థానం), 200 మీటర్ల పరుగు (1వ స్థానం), లాంగ్‌జంప్‌ (3వ స్థానం), జావెలిన్‌ త్రో (9వ స్థానం)... ఇలా వరుసగా ఆమె ప్రదర్శన కొనసాగింది.

అయితే చివరి ఈవెంట్‌ 800 మీటర్ల పరుగులో సత్తా చాటడంతో కాంస్యం ఖాయమైంది. ఈ పరుగును 2 నిమిషాల 15.33 సెకన్లలో పూర్తి చేసిన నందిని అగ్ర స్థానంలో నిలిచింది. దాంతో ఓవరాల్‌ పాయింట్లలో ఆమె మూడో స్థానానికి ఎగబాకింది.

2018 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన మరో భారత అథ్లెట్‌ స్వప్న బర్మన్‌ చివరి వరకు పోటీలో నిలిచినా... ఓవరాల్‌గా 5708 పాయింట్లతో నాలుగో స్థానానికే పరిమితమైంది.

పేద కుటుంబం
పేద కుటుంబం నుంచి వచ్చి నార్సింగిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివిన నందిని అదే పాఠశాలలో నెలకొల్పిన అథ్లెటిక్స్‌ అకాడమీ తొలి బ్యాచ్‌ విద్యార్థిని. ప్రస్తుతం సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిన సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీబీఏ చదువుతున్న నందినికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ తాజా విజయానికి రూ. 1 లక్ష నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement