వాళ్లేమో పరితపించిపోయారు.. మీరేమో ఇలా! అదే కొంపముంచింది.. ఇకనైనా! | Aussies More Desperate Team India Over Confident Fans On Ind Loss | Sakshi
Sakshi News home page

Ind Vs Aus: వాళ్లేమో పరితపించిపోయారు.. మీరేమో ఇలా! అదే టీమిండియా కొంపముంచింది!

Published Fri, Mar 3 2023 1:14 PM | Last Updated on Fri, Mar 3 2023 1:48 PM

Aussies More Desperate Team India Over Confident Fans On Ind Loss - Sakshi

రవీంద్ర జడేజాతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

India vs Australia, 3rd Test: మూడో టెస్టులో టీమిండియాపై గెలుపుతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ప్రవేశించింది ఆస్ట్రేలియా. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్‌ టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్మిత్‌ బృందం సంబరాల్లో మునిగిపోయింది. కాగా 2004 తర్వాత భారత్‌లో ఆసీస్‌కు దక్కిన రెండో టెస్టు విజయం ఇదే కావడం విశేషం.

గెలుపు కోసం తపన
2017లో స్టీవ్‌ సారథ్యంలోని కంగారూ జట్టు పుణె వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 333 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ తర్వాత ఆసీస్‌కు భారత గడ్డపై ఇదే తొలి గెలుపు. ఇప్పుడు కూడా స్మిత్‌ సారథ్యం(ప్యాట్‌ కమిన్స్‌ గైర్హాజరీలో)లోనే విజయాన్ని అందుకోవడం విశేషం.

ఇక టీమిండియాతో నాలుగో టెస్టుల సిరీస్‌ ఆరంభానికి ముందుగానే భారత్‌ చేరుకున్న ఆస్ట్రేలియా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. కానీ.. తొలి రెండు టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించిన రోహిత్‌ సేన ఆసీస్‌ ఆశలపై నీళ్లు చల్లింది.

అదృష్టం కలిసి వచ్చింది!
అంతేకాదు డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసింది. ఇక మూడో టెస్టుకు ముందు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సహా వరుసగా ఐదుగురు ఆటగాళ్లు జట్టును వీడటం ఆసీస్‌ను కలవరపరిచింది. గెలుపు కోసం తపిస్తున్న తరుణంలో స్టీవ్‌ స్మిత్‌ చేతికి పగ్గాలు రాగా.. అదృష్టవశాత్తూ ఇండోర్‌ పిచ్‌ తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలించడం.. మాథ్యూ కుహ్నెమన్‌, నాథన్‌ లియోన్‌ రాణించడంతో ఆసీస్‌ ఆధిపత్యం కనబరిచింది. 

ఉస్మాన్‌ ఖవాజా అద్భుత బ్యాటింగ్‌తో పటిష్ట స్థితిలో నిలిచి టీమిండియాకు సవాల్‌ విసిరింది. అయితే, బ్యాటర్లు మరోసారి వైఫల్యం చెందడంతో తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

నిజానికి టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఎంచుకుని తప్పుచేశాడనే అభిప్రాయాలు వ్యక్తమైనా.. ఆసీస్‌ బ్యాటింగ్‌ చూసిన తర్వాతే ఓ అంచనాకు రావాలని అభిమానులు భావించారు. కానీ.. భారత బ్యాటర్లు విఫలమైన చోట.. ఆస్ట్రేలియా బ్యాటర్లు రాణించి.. ఆతిథ్య జట్టును కష్టాల్లో పడేశారు.

అతి విశ్వాసమే కొంపముంచింది
దీంతో తొలి రెండు టెస్టుల్లో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్బుతంగా రాణించడంతో అదరగొట్టిన టీమిండియా మూడో టెస్టులో​ మాత్రం బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలో అభిమానులు భారత బ్యాటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతి విశ్వాసమే టీమిండియా కొంపముంచిందని ట్రోల్‌ చేస్తున్నారు. 

గెలుపు కోసం పరితపించిపోయిన ఆస్ట్రేలియాకు సునాయాస విజయాన్ని అందించడంలో మీ పాత్రే ఎక్కువగా ఉందంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ‘‘వాళ్లేమో ఎంచక్కా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్లారు.. మనం మాత్రం ఇంకా వేచిచూడాల్సిన దుస్థితి తెచ్చారు’’ అని మండిపడుతున్నారు.

ఏదేమైనా ఆస్ట్రేలియా తమకు వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఆఖరి టెస్టులో గెలిచి బదులు తీర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మూడో టెస్టు స్కోర్లు:
ఇండియా- 109 & 163
ఆస్ట్రేలియా-  197 & 78/1
విజేత- ఆస్ట్రేలియా
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్: నాథన్‌ లియోన్‌(11 వికెట్లు)

చదవండి: WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి ఆస్ట్రేలియా.. అదే జరిగితే టీమిండియాకు కష్టమే!? అయితే..
Rohit Sharma: పిచ్‌ ఎలా ఉంటే ఏంటి? మా ఓటమికి ప్రధాన కారణం అదే! ఇకపై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement