దుబాయ్ : ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ రేసులో ఇప్పటి వరకు భారత్ అగ్రస్థానంలో సాగింది. ఆడిన 9 మ్యాచ్‌లలో 7 గెలిచి 2 ఓడిన టీమిండియా... 360 పాయింట్లతో ముందంజలో నిలిచింది. అయితే కరోనా కారణంగా పలు సిరీస్‌లు రద్దు కావడంతో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం పాయింట్ల విధానాన్ని మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా నిర్ణయించింది. ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం పాయింట్ల సంఖ్యను చూస్తూ ఐసీసీ విజయ శాతాన్ని లెక్కించనుంది. దాంతో మొత్తం 480 పాయింట్ల (4 సిరీస్‌లు) ద్వారా 360 పాయింట్లు సాధించిన భారత్ విజయ శాతం 75 % గా ఉంది.
అదే ఆస్ట్రేలియా అందుబాటులో ఉన్న 360 పాయింట్ల (3 సిరీస్‌లు) 296 పాయింట్లు సాధించడంతో జట్టు విజయ శాతం 82.2%గా నిలిచింది. దాంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ నంబర్‌వన్ కాగా, టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. 60.8 శాతంతో ఇంగ్లండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో వైపు నవంబర్ 2022లో జరగాల్సిన మహిళల టి20 ప్రపంచ కప్‌ను ఫిబ్రవరి 2023కి ఐసీసీ వాయిదా వేసింది. 2022లో ఇప్పటికే మహిళల వన్డే వరల్డ్ కప్, కామన్వెల్త్ క్రీడలు ఉండటంతో పాటు 2023లో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా లేకపోవడమే దీనికి కారణం.
దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా
కేప్‌టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్‌గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్‌నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. మరో వైపు తాజా సిరీస్‌లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్‌గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్‌లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment