![Australia Tour India For 3-Match T20I Series In September - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/10/t20.jpg.webp?itok=hXorbV7L)
టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్‌లో బిజీగా ఉన్నారు. ఆఖరి అంకానికి చేరుకున్న ఐపీఎల్ 15వ సీజన్ మే 29తో ముగియనుంది. ఐపీఎల్ ముగియగానే టీమిండియా బిజీ కానుంది. ఏడాదిపాటు వివిధ దేశాలతో ఇంటా, బయటా సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలోనే రానున్న సెప్టెంబర్ 2022లో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చే అవకాశముంది. ఈ పర్యటనలో ఆసీస్ జట్టు టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తర్వలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది.
నవంబర్- డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు ఇది సన్నాహాకంగా ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఆస్ట్రేలియా ఈ ఏడాది పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో.. ఒకే ఒక్క టి20 మ్యాచ్‌ను గెలిచిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో పోగొట్టుకుంది. ఇక ఆసియా గడ్డపై మరొక బలమైన జట్టుతో ఆస్ట్రేలియా పోటీ పడనుంది. టి20లో చాంపియన్స్ అయిన ఆసీస్‌ను టీమిండియా స్వదేశంలో ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.
ఇక ఐపీఎల్ 2022 సీజన్ ముగియగానే టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో జూన్ 9 నుంచి 19 మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. అక్కడి నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు చేరుకోనున్న టీమిండియా గతేడాది కరోనాతో వాయిదా పడిన ఐదో టెస్టు(ఏకైక టెస్టు)తో పాటు మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది.
ఇక ఆగస్టులో టీమిండియా ఆసియాకప్‌లో బిజీ కానుంది. అటుపై ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం ప్రతిష్టాత్మక టి20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగాటోర్నీ ముగియగానే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. ఇలా జూన్ నుంచి డిసెంబర్ వరకు టీమిండియా తీరిక లేకుండా మ్యాచ్‌లతో బిజీబిజీగా గడపనుంది. ఈ ఆరు నెలల కాలంలో ఎక్కువగా టి20లు ఆడనున్న టీమిండియాకు 2022 టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా మంచి ప్రాక్టీస్ లభించినట్లవుతుంది.
చదవండి: Rovman Powell: 'మూడురోజులు టవల్ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'
Comments
Please login to add a commentAdd a comment