
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ బాబర్ అదరగొడుతున్నాడు. తాజాగా మంగళవారం నెదార్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో ఆజం 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేట్ హషీమ్ ఆమ్లా ప్రపంచ రికార్డును ఆజం బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో 88 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆజం నిలిచాడు.
ఇప్పటి వరకు ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 4473 పరుగులతో ఆమ్లా తొలి స్థానంలో ఉండగా.. తాజా మ్యాచ్‌లో బాబర్ 4516 పరుగులు సాధించి ఈ రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌కు నెదార్లాండ్స్ చుక్కలు చూపించింది. నెదార్లాండ్స్ 16 పరుగులతో ఓటమి పాలైనప్పటికీ.. అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది.
తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ సెంచరీ(109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 109 పరుగులుతో చెలరేగగా..కెప్టెన్ బాబర్ ఆజం 74 పరుగులతో రాణించాడు.
నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మాకు ఒకటి, వాన్ బీక్‌కు రెండు, బాస్ డె లీడేకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో విక్రమ్‌జిత్ సింగ్ (65),టామ్ కూపర్(65),స్కాట్ ఎడ్‌వర్డ్స్( 71) పరుగులు సాధించారు.
చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా చంద్రకాంత్ పండిట్.. కేకేఆర్ దశ మారనుందా!