పాకిస్తాన్, యూఏఈ వేదికలుగా వచ్చే నెల (ఫిబ్రవరి) 19 నుంచి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ షాంటో నియమితుడయ్యాడు. షాంటో గాయం కారణంగా ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. షాంటో గైర్హాజరీలో విండీస్ పర్యటనలో మెహిది హసన్ మిరాజ్ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించాడు. విండీస్‌తో సిరీస్‌ను బంగ్లాదేశ్ 0-3 తేడాతో కోల్పోయింది.
షాంటోతో పాటు గాయాల బారిన పడ్డ ముష్ఫికర్ రహీం, తౌహిద్ హృదోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆటగాడు లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. విండీస్ పర్యటనలో చెత్త ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 6 పరుగులు) కారణంగా దాస్ జట్టులో చోటు కోల్పోయాడు. దాస్‌పై వేటు వేసినట్లు బంగ్లా చీఫ్ సెలెక్టర్ ఘాజీ అష్రఫ్ హొస్సేన్ తెలిపాడు. లిటన్ దాస్ గైర్హాజరీలో జాకెర్ అలీ బంగ్లా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడని అష్రఫ్ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో లిటన్ దాస్‌తో పాటు షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్‌లకు కూడా చోటు దక్కలేదు. షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, అఫీఫ్ హొస్సేన్ కూడా విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యారు.
బంగ్లా జట్టు పేస్ విభాగం యువకులు, సీనియర్లతో (నహీద్ రాణా, తంజిమ్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్) సమతూకంగా ఉంది. స్పిన్ విభాగాన్ని లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ లీడ్ చేస్తాడు. రిషద్‌తో పాటు స్పిన్ విభాగంలో మెహిది హసన్, నసుమ్ అహ్మద్ ఉన్నారు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ విషయానికొస్తే.. నజ్ముల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి సీనియర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
గత వారం జరిగిన బౌలింగ్ అసెస్‌మెంట్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన షకీబ్ అల్ హసన్ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సీనియర్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడని తొలుత ప్రచారం జరిగింది. ఇటీవలే తమీమ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బంగ్లా సెలెక్టర్లు ఇతన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్.. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. బంగ్లా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న టీమిండియాతో ఆడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టు..
నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, జాకర్ అలీ అనిక్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, నహిద్ రాణా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment