లక్ష్యం 185; ప్రస్తుతం 42/0
పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 172 ఆలౌట్
నిప్పులు చెరిగిన హసన్, నహిద్
రావల్పిండి: పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాద్‌మన్ ఇస్లామ్ (9 బ్యాటింగ్) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది.
ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్ అయూబ్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్ ఆజమ్ (11; 1 ఫోర్) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్ అహ్మద్ ఓవర్లో అయూబ్ ని్రష్కమించగా, యువ సీమర్ నహిద్ రాణా... మసూద్, బాబర్‌లతో పాటు సౌద్ షకీల్ (2)ల వికెట్లను పడగొట్టాడు.
దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్‌ను హసన్ మహ్ముద్ అవుట్ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు.
రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ హసన్ మహ్ముద్ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్ నహిద్ రాణా (4/44) పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్ హసన్, ఇస్లామ్ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment