
వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులు, నలుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన భారత బృందాన్ని ఇదివరకే ప్రకటించిన విషయం తెలసిందే. అయితే ఈ జట్టు ఎంపికపై అభిమానులతో పాటు పలువురు సీనియర్లు, మాజీ, విశ్లేషకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మరింది. కొందరు సంజూ శాంసన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మహ్మద్ షమీని 15 మంది సభ్యుల బృందంలోకి తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు.
ఈ విషయంపై తాజాగా ఓ బీసీసీఐ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీకి 15 మంది సభ్యుల బృందంలోని వచ్చేందుకు దారులు మూసుకుపోలేదని, త్వరలో జరుగనున్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాలలో ఎవరు విఫలమైనా వారి ప్లేస్‌లో మహ్మద్ షమీ ఫైనల్ 15లోకి వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సమాంతరంగా ఈ సిరీస్‌ల్లో షమీ సైతం రాణించాల్సి ఉంటుందని, ఇది జరిగితే షమీ ప్రపంచ కప్‌లో ఆడటం ఖాయమని అన్నాడు.
షమీని స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేయడంపై సదరు సెలెక్టర్ స్పందిస్తూ.. 10 నెలల పాటు పొట్టి ఫార్మాట్‌కు (జాతీయ జట్టుకు) దూరంగా ఉన్న కారణంగా షమీని తుది జట్టులోకి (15 మంది సభ్యుల బృందం) తీసుకోలేదని వివరణ ఇచ్చాడు. షమీ జట్టుకు దూరంగా ఉన్నసమయంలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించాడు కాబట్టే అతనికి అవకాశం దక్కిందని పేర్కొన్నాడు.
కాగా, షమీని స్టాండ్ బైగా ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 14 మంది పేయర్లని ఏకాభిప్రాయంతో ఎంపిక చేసిన సెలెక్టర్లు.. 15వ ఆటగాడి ఎంపికను హిట్‌మ్యాన్‌కు వదిలేసినట్లు తెలుస్తోంది. 15వ బెర్త్ కోసం షమీ, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోటీలో, కెప్టెన్ ..అశ్విన్‌కే ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది.
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహార్
Comments
Please login to add a commentAdd a comment