క్రికెట్‌లో వయసు దొంగల పని పట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వయసు దాచి దొంగ సర్టిఫికెట్లతో వివిధ స్థాయిల క్రికెట్‌లో అవకాశాలు పొందాలనుకునే వారికి ఈ ప్రయోగంతో చెక్ పెట్టనుంది. ఇందుకోసం బీసీసీఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన సరికొత్త సాఫ్ట్‌వేర్ సేవలను వినియోగించుకోనుంది.
ఈ సాఫ్ట్‌వేర్ వల్ల అతి తక్కువ సమయంలో వయసు మోసాలను గుర్తించడంతో పాటు ఖర్చులు కూడా 80 శాతం మేరకు ఆదా అవుతాయని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం వయసు సంబంధిత మోసాలను గుర్తించేందుకు బీసీసీఐ టీడబ్ల్యూ3 (ఎడమ చేయి, మణికట్టు ఎక్స్‌రే ఆధారంగా) విధానాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో ఒక్కో పరీక్షకు రూ.2400 ఖర్చవుతోంది. అంతేకాకుండా 3-4 రోజుల సమయం పడుతోంది.
అదే బోన్ ఎక్స్‌పర్ట్ సాఫ్ట్‌వేర్ సాయంతో అయితే ఫలితం క్షణాల్లో రావడంతో పాటు ఖర్చు కూడా రూ. 288 రూపాయలే అవుతుంది. దీంతో బీసీసీఐ ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ సాయంతో వయసు దొంగల ఆట కట్టించాలని నిర్ణయించింది. దీంతో పాటు సంప్రదాయ టీడబ్ల్యూ3 టెస్ట్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, భారత క్రికెట్‌లో వయసు తక్కువగా చూపుతూ (తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలతో) వివిధ స్థాయిల క్రికెట్‌లో అవకాశాలు పొందాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది. 2019 జూన్‌లో జమ్ముకశ్మీర్ పేసర్ రసిక్ ఆలమ్ తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కేసులో రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. ఇలా తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన వారిలో చాలా మంది పాపులర్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
చదవండి: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..!
Comments
Please login to add a commentAdd a comment