BGT 2023: Khawaja In Utter Disbelief As KL Rahul One Handed Stunner, Video Viral - Sakshi
Sakshi News home page

BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్‌ అద్భుత క్యాచ్‌.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్‌

Published Fri, Feb 17 2023 3:37 PM | Last Updated on Fri, Feb 17 2023 4:27 PM

BGT 2023: Khawaja In Utter Disbelief As KL Rahul One Handed Stunner - Sakshi

అద్భుత క్యాచ్‌తో మెరిసిన కేఎల్‌ రాహుల్‌ (PC: BCCI)

India vs Australia, 2nd Test- KL Rahul Catch Video Viral: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైనప్పటికీ ఢిల్లీ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌ టెస్టులో ఈ కర్ణాటక బ్యాటర్‌ కేవలం 20 పరుగులే చేశాడు. 70 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌ సాయంతో ఈ మేరకు స్కోరు చేశాడు.

దీంతో.. రాహుల్‌ ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను కాదని.. ఫామ్‌లేమితో సతమతమవుతున్న రాహుల్‌కు ఛాన్స్‌ ఇచ్చిన మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్‌ మండిపడ్డారు.

ఈ క్రమంలో వరుసగా విఫలమవుతున్న రాహుల్‌కు రెండో టెస్టు జట్టులో చోటు దక్కదని భావించారంతా! కానీ తొలి మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ను తప్పించిన మేనేజ్‌మెంట్‌.. రాహుల్‌ను మాత్రం కొనసాగించింది. శ్రేయస్‌ అయ్యర్‌ రాకతో సూర్యకు నిరాశ ఎదురుకాగా.. రాహుల్‌ వల్ల గిల్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది.

సంచలన క్యాచ్‌తో
ఈ నేపథ్యంలో రాహుల్‌ పట్ల బీసీసీఐ సెలక్టర్లకు అంత ప్రేమ ఎందుకో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ సంచలన క్యాచ్‌తో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచాడు.

గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని కీలక వికెట్‌ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(81) అద్భుత పోరాటం చేశాడు.

బిత్తరపోయిన ఖవాజా
ప్రమాదకరంగా మారుతున్న అతడిని టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా.. అద్భుత బంతి(45.5 ఓవర్‌)తో బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన బాల్‌ను రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయిన ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్‌ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు.

నమ్మశక్యం కాని రీతిలో రాహుల్‌ అద్భుత క్యాచ్‌ అందుకోవడంతో ఆశ్చర్యపోవడం ఖవాజా వంతైంది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన బీసీసీఐ.. వాట్‌ ఏ క్యాచ్‌ అంటూ రాహుల్‌ను కొనియాడింది. ఇదిలా ఉంటే.. ఖవాజాను అవుట్‌ చేసి జడ్డూ టెస్టుల్లో 250 వికెట్లు పూర్తి చేసుకోవడం విశేషం.

చదవండి: Tom Blundell: కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ బ్లండెల్‌ ప్రపంచ రికార్డు.. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాలేదు!
Ravichandran Ashwin:'చేసేయాల్సింది ఒక పనైపోయేది..'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement