న్యూఢిల్లీ: ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ టీమిండియా సారధి విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో అందుకు గల కారణాలపై విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ సైతం తన అభిప్రాయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టీమిండియా సారథికి, బీసీసీఐకి మధ్య చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడినట్లనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఈ కారణం చేతనే కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న కఠినమైన నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
కోహ్లి ఒకటి చెబితే, బీసీసీఐ మరొకటి చెబుతుందని అనుకోలేమని, ఈ నిర్ణయం కోహ్లి వ్యక్తిగత నిర్ణయమే అయ్యింటుందని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనప్పటికీ కోహ్లి నిర్ణయం అతని బ్యాటింగ్‌ను మెరుగుదిద్దుకునేందుకు తోడ్పడుతుందని తెలిపాడు. ఇండియన్ క్రికెట్‌కు కోహ్లి గొప్ప ఆస్తి అని.. అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని కొనియాడాడు. కోహ్లి సారధ్యంలో టీమిండియా పొట్టి ప్రపంచకప్‌ను సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినా.. దేశం తరఫున పరుగులు చేస్తూనే ఉండాలని ఆకాంక్షించాడు. టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకునేందుకు రోహిత్‌కు మించిన అర్హుడు మరొకరు లేరని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
కాగా, 1983 భారత్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పాటిల్ 2012-16 మధ్యలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా వ్యవహరించాడు. 80ల్లో భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న పాటిల్.. రిటైర్మెంట్ అనంతరం కెన్యా జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో కెన్యా 2003 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించింది. 1980-86 మధ్య భారత జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగిన పాటిల్.. 29 టెస్ట్‌లు, 45 వన్డేల్లో 2500లకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్‌సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లలో కలపి అతను 24 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ఆ ఆర్సీబీ ఆటగాడు ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఇంకా ఉంది..
Comments
Please login to add a commentAdd a comment