![A Brilliant Deodhar Trophy With Both Bat And Ball For Riyan Parag - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/4/Untitled-2_0.jpg.webp?itok=awSYw6cG)
ఆన్ ఫీల్డ్ బిహేవియర్ కారణంగా ఓవరాక్షన్ ప్లేయర్‌గా ముద్ర వేసుకున్న టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్.. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటున్నాడు. ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన రియాన్.. తాజాగా ముగిసిన దియోదర్ ట్రోఫీ-2023లో బ్యాట్‌తో బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. దియోదర్ ట్రోఫీలో 5 మ్యాచ్‌లు ఆడిన రియాన్.. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన రియాన్.. బంతితోనూ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన రియాన్.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తన జట్టు (ఈస్ట్ జోన్) కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. సౌత్ జోన్‌తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 21 ఏళ్ల రియాన్.. తన జట్టును గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు.
తొలుత బంతితో (2/68) మ్యాజిక్ చేసిన రియాన్.. ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగాస్వామ్యం నెలకొల్పిన రియాన్.. ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ ఓటమి ఖరారైంది.
కాగా, దియోదర్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్.. రోహన్ కున్నుమ్మల్ (107), మయాంక్ అగర్వాల్ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్ జోన్.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు.
దియోదర్ ట్రోఫీ-2023లో రియాన్ పరాగ్ స్కోర్లు, వికెట్లు..
- నార్త్ ఈస్ట్ జోన్‌పై 13 పరుగులు, 4 వికెట్లు
- నార్త్ జోన్‌పై 131 పరుగులు, 4 వికెట్లు
- సౌత్ జోన్‌పై 13 పరుగులు, ఒక వికెట్
- వెస్ట్ జోన్‌పై 102 నాటౌట్
- ఫైనల్లో సౌత్ జోన్‌పై 95 పరుగులు, 2 వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment