రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ఛత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం సారధి రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే సుడిగాలి శతకం బాదాడు. జట్టు కష్టాల్లో (ఫాలో ఆన్) ఉన్నప్పుడు రియాన్ ఆడిన ఈ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా కీర్తించబడుతుంది.
రియాన్ మెరుపు శతకం సాయంతో అస్సాం దారుణ ఓటమి బారి నుంచి తప్పించుకుని, 21 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులుగా ఉంది. అస్సాం ఇన్నింగ్స్‌లో (సెకెండ్) రిషవ్ దాస్ 17, రాహుల్ హజారికా 39, సుమిత్ సుమిత్ 16, బిషల్ రాయ్ 8, దెనిశ్ దాస్ 0, ఆకాశ్‌సేన్ గుప్తా 3 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్, కునాల్ క్రీజ్‌లో ఉన్నారు.
అంతకుముందు సౌరభ్ ముజుందార్ 5 వికెట్లతో చెలరేగడంతో అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో159 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతుంది. రవి కిరణ్ 3, వాసుదేవ్ ఓ వికెట్ పడగొట్టారు. అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో దెనిశ్ దాస్ (52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్.. కెప్టెన్ అమన్‌దీప్ దేశాయ్ సెంచరీతో (116) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. శశాంక్ సింగ్ (82), అశుతోష్ (58) అర్ధసెంచరీలతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్ హుస్సేన్, మ్రిన్‌మోయ్ దత్తా, ఆకాశ్‌సేన్ గుప్తా, రాహుల్ సింగ్, కునాల్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment