10 మంది డకౌట్‌.. 2 పరుగులకే ఆలౌట్‌ | Buckden Cricket Club All Out For 2 Runs Against Falcons In Huntingdonshire County League | Sakshi
Sakshi News home page

కౌంటీ క్రికెట్‌ చరిత్రలో దారుణమైన గణాంకాలు నమోదు

Published Tue, Jun 22 2021 4:57 PM | Last Updated on Tue, Jun 22 2021 5:32 PM

Buckden Cricket Club All Out For 2 Runs Against Falcons In Huntingdonshire County League - Sakshi

లండన్‌: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌‌లోని ఓ వన్డే జట్టు అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేసి, క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌లో భాగంగా ఫాల్కన్ జట్టుతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో బక్డెన్​క్రికెట్ క్లబ్ జట్టు అత్యంత చెత్త బ్యాటింగ్‌తో కేవలం రెండంటేరెండు పరుగులు మాత్రమే నమోదు చేసి ఆలౌటైంది. బక్డెన్ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ రన్ తీయలేకపోయారు. పది మంది ప్లేయర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. ప్రత్యర్ధి బౌలర్లు అమన్‌దీప్‌సింగ్, హైదర్ అలీ దెబ్బకు బక్డెన్ ప్లేయర్లు ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్లిపోయారు. 

అమన్‌దీప్ నాలుగు ఓవర్లను మెయిడిన్ చేసి 6 వికెట్లు పడగొట్టగా, అలీ 4.3 ఓవర్లలో రెండు మెయిడిన్ చేసి రెండు వికెట్లు తీశాడు. స్కోర్ బోర్డుపై నమోదైన ఆ రెండు పరుగులు కూడా వైడ్, బై రూపంలో వచ్చినవే. వివరాల్లో వెళితే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్​జట్టు నిర్ణీత 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఫహీమ్ సబీర్ భట్టి (65), మురాద్ అలీ (67) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 261 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బక్డెన్‌ జట్టు.. అమన్‌దీప్‌సింగ్(6/0), హైదర్ అలీ(2/0) ధాటికి 8.3 ఓవర్లలో 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.​దీంతో ఫాల్కన్ జట్టు 258 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 

హంటింగ్‌డాన్‌షైర్ కౌంటీ లీగ్‌లో భాగంగా జూన్ 19న జరిగిన ఈ మ్యాచ్‌ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ బోర్డు వైరల్‌గా మారింది.కాగా, ఈ మ్యాచ్‌లో దారుణ పరాభవం అనంతరం బక్డెడ్ జట్టు కెప్టెన్ జోయల్ మీడియాతో మాట్లాడాడు. జట్టులోని 15 మంది ప్రధాన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు గైర్హాజయ్యారని, వ్యక్తిగత కారణాల వల్ల వారంతా మ్యాచ్‌లో ఆడలేకపోయారని, చేసేదేమీ లేక రెండో జట్టుతో బరిలోకి దిగామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, కొద్ది రోజుల ముందు ఇదే ఫాల్కన్‌తో జరిగిన మ్యాచ్‌లో బక్డెన్‌ జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: పాక్‌ క్రికెట్‌లో ముసలం.. బాధ్యతల నుంచి తప్పుకున్న యూనిస్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement