నెదర్లాండ్స్ ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నెదర్లాండ్స్.. కెనడా చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో భాగంగా నిన్న (ఆగస్ట్ 26) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటంగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది.
ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌కు ఇది తొలి పరాజయం కాగా.. కెనడాకు తొలి విజయం. ఈ టోర్నీలో పాల్గొంటున్న మరో జట్టు యూఎస్‌ఏ. ఆ జట్టు ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.
రాణించిన శ్రేయస్, జాఫర్
తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా శ్రేయస్ మొవ్వ (33), సాద్ బిన్ జాఫర్ (33) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. కెనడా ఇన్నింగ్స్‌లో ఆరోన్ జాన్సన్, పఠాన్, రవీంద్రపాల్ డకౌట్లు కాగా.. నికోలస్ కిర్టన్ 13, హర్ష్ థాకర్ 10, పర్వీన్ కుమార్ 4, అఖిల్ కుమార్ 9, డిల్లన్ హేలిగర్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. డచ్ బౌలర్లలో కైల్ క్లెయిన్, వాన్ మీకెరెన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. డొరామ్ 2, విక్రమ్‌జీత్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
సత్తా చాటిన కెనడా బౌలర్లు
133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది.పర్వీన్ కుమార్, కలీమ్ సనా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హేలిగర్, సాద్ బిన్ జాఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో నోవహా క్రోయిస్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment