
నేపాల్ టీ20 ట్రై సిరీస్‌లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్ (7 బంతుల్లో 11; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడి నేపాల్‌ను విజయానికి చేరువ చేశారు.
అయితే చివరి ఓవర్ మూడు, నాలుగు బంతులకు కరణ్, దీపేంద్ర ఔట్ కావడంతో నేపాల్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్ 17వ ఓవర్‌లో 9 పరుగులు, 18వ ఓవర్‌లో 18, 19వ ఓవర్‌లో 15, 20వ ఓవర్‌లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్‌లో దీపేంద్ర సింగ్ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్‌గా మలచి నేపాల్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (54), సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ట్ (49), ఎడ్వర్డ్స్ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్ ఓడౌడ్ (4) తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, కుశాల్ మల్లా తలో వికెట్ పడగొట్టగా.. ఎడ్వర్డ్, తేజ రనౌట్ అయ్యారు.
ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్, కరణ్‌తో పాటు ఆరంభంలో ఆసిఫ్ షేక్ (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (50) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్, సైబ్రాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్ కింగ్మా, వాన్ డర్ గుగ్టెన్, ఆర్యన్ దత్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.