
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సర్వం సిద్దమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు తెరలేవనుంది. 25 ఏళ్ల తర్వాత.. ఐసీసీ వన్డే టోర్నీ టైటిల్ ఫైట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆఖరిగా తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో భారత్‌ను 4 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది.
దీంతో నేడు జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎలాగైనా ఓడించి తమ 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఈ టైటిల్ పోరు అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.
రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?
కాగా భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023, వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. మరుసటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా అద్బుతం చేసింది.
టీ20 వరల్డ్‌కప్-2024 విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధిస్తే వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీసీసీఐతో హిట్‌మ్యాన్ మాట్లాడాడని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశానికి కూడా రోహిత్ గైర్హజారీ అయ్యాడు.
రిటైర్మెంట్‌కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హిట్‌మ్యాన్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గిల్ మాత్రం డ్రెసింగ్ రూమ్‌లో ఏ ఆటగాడి రిటైర్‌మెంట్ గురించి చర్చ జరగడం స్పష్టం చేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడో? ఆదివారం తేలిపోనుంది.
చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
Comments
Please login to add a commentAdd a comment