లండన్: బోర్డర్–గావస్కర్ ట్రోఫీ, చాపెల్–హ్యడ్లీ ట్రోఫీ, వార్న్–మురళీధరన్ ట్రోఫీ తరహాలో ఇప్పుడు మరో సిరీస్‌ను ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్లతో వ్యవహరించనున్నారు. వెస్టిండీస్– ఇంగ్లండ్ జట్ల మధ్య ఇకపై జరిగే టెస్టు సిరీస్‌లను ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’ పేరుతో వ్యవహరిస్తారు. ప్రపంచ క్రికెట్‌పై తమదైన ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు స్టార్లను తగిన విధంగా గౌరవించుకునేంందుకు ఇరు బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.
వెస్టిండీస్–ఇంగ్లండ్ మధ్య జరిగే తర్వాతి టెస్టు సిరీస్ నుంచి ఈ ట్రోఫీ పేరును ఉపయోగిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే సిరీస్‌ను ఇప్పటి వరకు ‘విజ్డన్ ట్రోఫీ’గా వ్యవహరిస్తున్నారు. ‘క్రికెట్ బైబిల్’గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత మ్యాగజైన్ ‘విజ్డన్’ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1963లో ఇరు జట్ల బోర్డులు కలిపి పెట్టిన పేరు ఇన్నేళ్లు కొనసాగింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు ‘విజ్డన్ ట్రోఫీ’లో చివరిది కానుంది.
Comments
Please login to add a commentAdd a comment