మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టును రిలీజ్ చేశారు. మైనర్‌ను బ్రిజ్ భూషణ్ వేధించినట్లు ఆధారాలు లేవని పోలీసులు తమ చార్జ్‌షీట్‌లో తెలిపారు. బ్రిజ్‌పై మైనర్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు తమ రిపోర్టులో కోరారు.
కాగా లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు దాదాపు 1000 పేజీల చార్జ్‌షీట్ రిపోర్టును తయారు చేశారు. కేవలం మైనర్ కేసు విషయంలో సుమారు 500 పేజీల నివేదికను పొందుపరిచారు. దాంట్లో ఆ కేసును రద్దు చేయాలని పోలీసులు సూచించారు.విచారణలో తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ పోలీసులు అధికారులు రిపోర్టును సమర్పించి 1500 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌పై తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.
ఏప్రిల్‌లో పోక్సో చట్టం కింద బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ అథ్లెట్ కేసు దాఖలు చేసింది. బ్రిజ్‌పై ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఆ మైనర్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసుల రిపోర్టు ద్వారా తెలుస్తోంది. తనను ఎంపిక చేయకపోవడం పట్ల ఆగ్రహంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై కేసును ఫైల్ చేసినట్లు ఆ మైనర్ అథ్లెట్ వెల్లడించింది.
చాలా కఠినంగా టోర్నీల కోసం వర్క్ చేశానని, కానీ తనను సెలెక్ట్ చేయలేదని, దాని వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఆ కోపంతో బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టినట్లు ఆ మైనర్ రెజ్లర్ పేర్కొన్నది. మైనర్ కేసు విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 173 కింద రిపోర్టును రూపొందించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. బాధిత మైనర్ తో పాటు ఆమె తండ్రి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నట్లు తెలిపారు. జూలై 4వ తేదీన మైనర్ కేసుపై కోర్టు విచారణ జరగనున్నది.
చదవండి: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
Comments
Please login to add a commentAdd a comment