![Cristiano Ronaldo Receives Guinness World Record Certificate - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/06/22/ronaldo-guinness-record.gif.webp?itok=zKDt3Dks)
Cristiano Ronaldo World Record- రెక్‌జావిక్ (ఐస్‌లాండ్): పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు దిగ్గజం, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో మైలురాయి అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూరో–2024 చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గ్రూప్ ‘జె’లో ఐస్‌లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో బరిలోకి దిగడంద్వారా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
38 ఏళ్ల రొనాల్డో ఆట 89వ నిమిషంలో చేసిన గోల్‌తో ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 1–0తో ఐస్‌లాండ్‌ను ఓడించింది. గ్రూప్ ‘జె’లో పోర్చుగల్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు కూడా రొనాల్డో (123 గోల్స్) పేరిటే ఉంది. మ్యాచ్‌కు ముందు రొనాల్డో ఘనతకు గుర్తింపుగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది.
2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. రొనాల్డో కెప్టెన్సీలో పోర్చుగల్ 2016 తొలిసారి యూరో చాంపియన్‌గా అవతరించింది. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో స్పోర్టింగ్ సీపీ, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు ఆడిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రొ లీగ్‌లో అల్ నాసర్ క్లబ్ జట్టుకు ఆడుతున్నాడు.
జాతీయ జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్–10 ఆటగాళ్లు
ప్లేయర్ - దేశం - మ్యాచ్‌లు
రొనాల్డో - పోర్చుగల్ - 200
బదర్ అల్ ముతవా - కువైట్ - 196
సో చిన్ అన్ - మలేసియా - 195
అహ్మద్ హసన్ - ఈజిప్ట్ - 184
అహ్మద్ ముబారక్- ఒమన్ - 183
సెర్జియో రామోస్- స్పెయిన్ - 180
ఆండ్రెస్ గ్వార్డాడో - మెక్సికో - 179
అల్‌దెయా - సౌదీ అరేబియా - 178
క్లాడియో స్వారెజ్- మెక్సికో - 177
గియాన్లుగి బఫన్ - ఇటలీ - 176 .
Comments
Please login to add a commentAdd a comment