వరల్డ్‌కప్ 2023 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. కోల్‌కతా వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక 49.4 ఓవర్లలో 21 పరుగులకు ఆలౌటయ్యారు. డేవిడ్ మిల్లర్ సెంచరీతో (101) సత్తా చాటగా.. క్లాసెన్ 47 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌కు విజయం అంత ఈజీగా దక్కలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 62 పరుగులతో పాటు 2 వికెట్లు తీసిన ట్రవిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. డగౌట్‌లో కూర్చోవడం కంటే క్రీజ్‌లో ఉండటమే తేలిక అనిపించింది. రెండు గంటలపాటు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అంతంగా ఫలితం అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. స్టార్క్, హాజిల్‌వుడ్ ఊహించని విధంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్ అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై వారు చెలరేగిపోయారు.
ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. టోర్నీ ఆరంభంలో మేము ఈ విభాగంలో చాలా బలహీనంగా ఉండి మ్యాచ్‌లు చేజార్చుకున్నాం. 37 ఏళ్ల వయసులోనూ వార్నర్ మైదానంలో పాదరసంలా కదులుతున్నాడు. ఈ రోజు ట్రవిస్ హెడ్‌ది. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు అమూల్యమైన పరుగులు మెరుపు వేగంతో చేశాడు. నాణ్యమైన సఫారీ స్పిన్నర్లను హెడ్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు.
మాలో కొద్దిమందికి ఇదివరకే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. కొంతమంది టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడారు. మరోసారి ఫైనల్‌కు చేరినందుకు ఆనందంగా ఉంది. భారత్‌తో ఫైనల్ ఇంకా ప్రత్యేకం. ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం నిండిపోతుంది. ప్రేక్షకులు భారత్‌కు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు. అలాంటి వాతావరణం ఊహించుకుంటేనే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment