వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది.
మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్‌లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్‌తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు.
24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్‌ను ఇచ్చారు. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి.
అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు.
Comments
Please login to add a commentAdd a comment