
చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 14) జరుగుతున్న హైఓల్టేజీ సమరంలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. పాకిస్తాన్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.
తొలి ఓవర్‌లోనే రికార్డులు బద్దలు..
యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన భారత్-పాక్ మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా ప్రారంభంలోనే రికార్డులు బద్దలుకొట్టింది. తొలి ఓవర్‌లో రికార్డు స్థాయిలో కోటిన్నర మంది హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను వీక్షించారు. ఓటీటీ చరిత్రలో తొలి ఓవర్‌లో ఈస్థాయిలో మ్యాచ్‌ను వీక్షించడం ఇదే మొదటిసారి. ఇదే కొనసాగితే వ్యూయర్‌షిప్ పరంగా ఈ మ్యాచ్ ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయం.
ఇదిలా ఉంటే, టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. రోహిత్ శర్మ ఆశించినట్లు ఆరంభ ఓవర్లలో వికెట్లు దక్కనప్పటికీ.. బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్‌లో బౌండరీ మినహాయించి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరో ఎండ్‌లో సిరాజ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
అతను వేసిన తొలి ఓవర్‌లో ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. 6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 28/0గా ఉంది. ఇమామ్ ఉల్ హాక్ (14), అబ్దుల్లా షఫీక్ (13) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా 3 ఓవర్లలో ఓ మెయిడిన్ వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment