ప్రస్తుత ప్రపంచకప్‌లో నామమాత్రపు అంచనాలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. అంచనాలకు మించి రాణిస్తూ (నెదర్లాండ్స్ చేతిలో పరాజయం మినహా) భారీ విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది.
పాయింట్ల ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికా కంటే ఒటమి ఎరుగని భారత్ మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, రన్‌రేట్ విషయంలో సౌతాఫ్రికా ఏ జట్టుకు అందనంత ఎత్తులో ఉంది. ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతో 2.370 రన్‌రేట్ కలిగి ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టుకు ఈ స్థాయి రన్‌రేట్ లేదు.
ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా ఇంతటి భారీ విజయాలు సాధించడంలో డికాక్, క్లాసెన్, మార్క్రమ్, డస్సెన్ కనిపించే హీరోలయితే (సెంచరీలు సాధించి).. కనిపించని హీరో మరొకరు ఉన్నారు. అతడే మార్కో జన్సెన్. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి తన పని తాను చేసుకుపోతున్న జన్సెన్.. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు (పాక్‌తో మ్యాచ్ కలుపుకుని) ఆడిన జన్సెన్ 61.50 సగటున 123 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టి అసలుసిసలు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మారాడు.
సౌతాఫ్రికా కల నెరవేరుస్తాడా..?
ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఉన్నట్లుండి హాట్ ఫేవరెట్ జట్టుగా మారిపోయింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి అగ్రశ్రేణి జట్లు చిన్న జట్ల చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో సఫారీలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు ఈ జట్టు వరల్డ్‌కప్ రేసులోకి దూసుకువచ్చింది. నెదర్లాండ్స్ చేతిలో పరాభవానికి కుంగిపోకుండా, ఆ జట్టు కనబరుస్తున్న పోరాటపటిమ అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ పరిస్థితుల్లో జన్సెన్ లాంటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సౌతాఫ్రికాకు అదనపు బలంలా మారాడు. అతడు ప్రతి మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్‌లా తయారయ్యాడు. తదుపరి మ్యాచ్‌ల్లో జన్సెన్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో రాణిస్తే, చాలా ఏళ్లుగా వరల్డ్‌కప్ గెలవాలన్న సౌతాఫ్రికా కల ఈసారి నెరవేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment