CWC Qualifiers: West Indies Eliminated From 2023 World Cup Race After Scotland Beat West Indies - Sakshi
Sakshi News home page

WC 2023: విండీస్‌కు ఘోర అవమానం.. పసికూన చేతిలో చిత్తు! వరల్డ్‌కప్‌ నుంచి అధికారికంగా అవుట్‌

Published Sat, Jul 1 2023 7:21 PM | Last Updated on Tue, Oct 3 2023 5:15 PM

CWC Qualifiers: Scotland Beat West Indies Former Champions Out Of WC 2023 - Sakshi

 ICC Cricket World Cup Qualifiers 2023: మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఒకప్పటి ఈ మేటి జట్టు ఈసారి కనీసం ప్రధాన పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్‌లోనే ఇంటిబాట పట్టింది. పసికూన స్కాట్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడి అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. 


ఇక .. వెస్టిండీస్‌ నిష్క్రమణతో సూపర్‌ సిక్సెస్‌లో ఇప్పటికే చెరో విజయం సాధించిన జింబాబ్వే, శ్రీలంకకు టాప్‌-10లో నిలిచేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు.. ఒకప్పుడు క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన విండీస్‌ స్కాట్లాండ్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడి అభిమానుల హృదయాలను ముక్కలు చేస్తూ భారం‍గా వెనుదిరిగింది.


టాప్‌-8లో ఆ జట్లు
కాగా వన్డే ప్రపంచకప్‌-2023 ఆతిథ్య టీమిండియా సహా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మెగా ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ ఎనిమిది జట్లతో క్వాలిఫయర్స్‌లో సూపర్‌ సిక్సెస్‌ దశలో టాప్‌-2లో నిలిచిన టీమ్‌లు వరల్డ్‌కప్‌ టోర్నీలో అడుగుపెడతాయి.

ఇందుకోసం జింబాబ్వే వేదికగా శ్రీలంక, వెస్టిండీస్‌తో పాటు అసోసియేట్‌ దేశాలు తలపడగా.. గ్రూప్‌- ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్‌, వెస్టిండీస్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ సూపర్‌ సిక్స్‌కు చేరుకున్నాయి.


నెదర్లాండ్స్‌ చేతిలోనూ ఓడి
ఈ క్రమంలో జింబాబ్వే ఒమన్‌ను, శ్రీలంక నెదర్లాండ్స్‌ను ఓడించి వరల్డ్‌కప్‌ ఈవెంట్‌కు అర్హత సాధించే క్రమంలో ముందడుగు వేశాయి. దీంతో ఇప్పటికే రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకపడి ఉన్న విండీస్‌.. తమకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి.

కానీ.. తొలి మ్యాచ్‌లోనే అది కూడా స్కాట్లాండ్‌ వంటి పసికూన చేతిలో ఓడటం వెస్టిండీస్‌ చెత్త ఆట తీరుకు అద్దం పట్టింది. కాగా గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌ చేతిలోనూ విండీస్‌ చిత్తు కావడం గమనార్హం.

మ్యాచ్‌ సాగిందిలా
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. హరారే వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 43.5 ఓవర్లకే చాపచుట్టేసింది. స్కాటిష్‌ బౌలర్ల విజృంభణకు తట్టుకోలేక 181 పరుగులకే కుప్పకూలింది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో జేసన్‌ హోల్డర్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌.. ఓపెనర్‌ క్రిస్టోఫర్‌ మెక్‌బ్రిడ్‌ డకౌట్‌ కావడంతో ఆదిలోనే తడబడింది. అయితే, మరో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ క్రాస్‌ అద్భుతంగా ఆడాడు. 74 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

ఇక బంతి(3 వికెట్లు)తో మెరిసిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ బ్రాండన్‌ మెక్‌ములెన్‌ 69 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement