ఇంతకంటే దిగజారడం ఉండదు: విండీస్‌ మాజీ కెప్టెన్‌ ఘాటు వ్యాఖ్యలు | This Is Lowest You Can Go Carlos Brathwaite After WI Crash Out Of WC 2023 | Sakshi
Sakshi News home page

WC 2023: ఇంతకంటే దిగజారడం ఉండదు: విండీస్‌ మాజీ కెప్టెన్‌ ఘాటు వ్యాఖ్యలు

Published Sun, Jul 2 2023 5:00 PM | Last Updated on Sun, Jul 2 2023 5:08 PM

This Is Lowest You Can Go Carlos Brathwaite After WI Crash Out Of WC 2023 - Sakshi

కార్లోస్‌ బ్రాత్‌వైట్‌

ICC Cricket World Cup Qualifiers 2023: ‘‘చాలా కాలంగా జట్టు వైఫల్యం కొనసాగుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12 స్టేజ్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇప్పుడిలా! పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోజురోజుకీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇక ఇంతకంటే దిగజారడం ఇంకేమీ ఉండదేమో’’ అని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

షాయీ హోప్‌ బృందం కనీసం వన్డే వరల్డ్‌కప్‌-2023 ప్రధాన పోటీకి అర్హత సాధించని నేపథ్యంలో జట్టు ఆట తీరును విమర్శించాడు. కాగా జింబాబ్వే వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో విండీస్‌ దారుణ వైఫల్యాలు మూటగట్టుకుంది.

గ్రూప్‌ స్టేజిలో జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిపోయింది. ఇక సూపర్‌ సిక్సెస్‌ దశలో స్కాట్లాండ్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకోవడమే తప్ప విండీస్‌ చేతిలో ఇంకేమీ మిగల్లేదు.

రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కరేబియన్‌ జట్టుకు ఈ దుస్థితి పట్టడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ఐసీసీ షోలో మాట్లాడుతూ.. షాయీ హోప్‌ బృందంపై విమర్శలు గుప్పించాడు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి
ఇక విండీస్‌ లెజండరీ పేసర్‌ ఇయాన్‌ బిషప్‌.. ‘‘మేటి జట్లపై మేము మెరుగ్గా ఆడి.. నిలకడైన ప్రదర్శన కనబరిచి దశాబ్దానికి పైగానే అయింది. కరేబియన్‌ జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒకరో ఇద్దరో పోరాడితే సరిపోదు.

అంతా కలిసి కట్టుగా ముందుకు రావాల్సి ఉంది’’ అంటూ విండీస్‌ క్రికెట్‌ బోర్డులో కుమ్ములాటలు, మ్యాచ్‌ ఫీజులపై పేచీలు తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి సొంతగడ్డపై టీమిండియాతో విండీస్‌ టెస్టు సిరీస్‌ మొదలుపెట్టనుంది.

చదవండి: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్​కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? 
ఆరోజు నాకు అన్యాయం చేసి ధోనికి అవార్డు ఇచ్చారు! ఎందుకంత ఏడుపు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement