
జేసన్ హోల్డర్
ICC Cricket World Cup Qualifiers 2023- SCO Vs WI: ‘‘ఇప్పుడేమీ అంతా ముగిసిపోలేదు. జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. వెస్టిండీస్ క్రికెట్‌కు కచ్చితంగా మళ్లీ పూర్వవైభవం తీసుకురాగలరు. సీనియర్లుగా మేము చేయాల్సిందల్లా.. వాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచుకునే దిశగా పూర్తిస్థాయిలో అండగా నిలవడమే!
లోపాలు సరిదిద్దుకుని ముందుకు సాగాలి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాలి’’ అని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ అన్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పడిలేచిన కెరటంలా తాము మళ్లీ క్రికెట్‌లో పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
మరీ ఘోరంగా
రెండుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్.. ఈసారి కనీసం ప్రధాన పోటీకి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫయర్స్ సూపర్ సిక్సెస్ దశలో స్కాట్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. పసికూన చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన మాజీ చాంపియన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో విండీస్ ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పటి చాంపియన్స్ మరీ ఇంత అవమానకరంగా మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
మళ్లీ అద్భుతాలు చేయగలం
ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో బ్లేమ్ గేమ్ మొదలుకాగా.. 31 ఏళ్ల జేసన్ హోల్డర్ మాత్రం ఆశావహ దృక్పథంతో ఉండటం విశేషం. ఆటలో గెలుపోటములు సహజమేనని... అయితే, ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకునే అంశంపై దృష్టిసారించాలని పేర్కొన్నాడు.
అదే విధంగా.. సరైన గైడెన్స్ ఉంటే యువ ఆటగాళ్లతో మళ్లీ అద్భుతాలు చేయవచ్చని పేర్కొన్నాడు. భేదాభిప్రాయాలు పక్కనపెట్టి సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని 31 ఏళ్ల జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు.
కాగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో 45 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన హోల్డర్.. స్కాట్లాండ్ ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్‌బ్రిడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జూలై 7న సూపర్ సిక్సెస్‌లో తమ చివరి మ్యాచ్ ఆడనున్న విండీస్.. జూలై 12 నుంచి టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధం కానుంది.
స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ స్కోర్లు:
టాస్: స్కాట్లాండ్- బౌలింగ్
వెస్టిండీస్- 181 (43.5)
స్కాట్లాండ్- 185/3 (43.3)
విజేత: ఏడు వికెట్ల తేడాతో స్కాట్లాండ్ గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బ్రాండన్ మెక్‌ములెన్ (3 వికెట్లు, 69 పరుగులు).
చదవండి: రెండు ప్రపంచకప్‌లలో ఎదురేలేని గెలుపు! కానీ ఇప్పుడు.. విండీస్ దుస్థితికి కారణాలివే
మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment