
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. అయితే జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు.
"టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. భారత్‌పై వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లో సాధించిన భారీ విజయం. టెస్టు, వన్డే ఫార్మాట్‌ల నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది.
అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న విషయం నాకు తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ నేను ఫిట్‌నెస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుకు అవసరమైతే కచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని సిడ్నీ గ్రౌండ్‌లో విలేకరుల సమావేశంలో వార్నర్ పేర్కొన్నాడు.
కాగా వన్డే ప్రపంచకప్-2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో డేవిడ్ వార్నర్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 528 పరుగులు చేసిన డేవిడ్ భాయ్.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా తన వన్డే కెరీర్‌లో 161 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా వార్నర్ కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment