
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఐపీఎల్‌లో దూసుకెళుతోంది. ముందుగా బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో చెలరేగడంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చిత్తుగా ఓడింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 59 పరుగుల తేడాతో బెంగళూరును కంగుతినిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్టొయినిస్ (26 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించగా... పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్ కోహ్లి (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
‘షా’న్‌దార్ ఇన్నింగ్స్...
కుర్రాడు పృథ్వీ షా దూకుడుతో ఢిల్లీ ఆట మొదలైంది. ఉదాన వేసిన తొలి ఓవర్లోనే అతను మూడు బౌండరీలు బాదాడు. సైనీ ఓవర్లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫోర్ కొడితే... షా ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్ బాదాడు. వెంటనే కోహ్లి ఐదో ఓవర్లోనే చహల్‌కు బంతి అప్పగించాడు. పృథ్వీ అతన్ని బౌలింగ్‌ను తేలిగ్గా కొట్టిపారేశాడు. వరుస బంతుల్లో 4, 6 సిక్స్ కొట్టాడు. ధావన్ మరో ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 4.5 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. బెంగళూరు శిబిరాన్ని కలవరపెట్టిన ఈ జోడీని సిరాజ్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7) విడదీశాడు. దీంతో 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
సూపర్ స్టొయినిస్...
ఆల్‌రౌండర్ స్టొయినిస్ విలువైన ఇన్నింగ్స్‌తో ఢిల్లీ భారీస్కోరు సాధించింది. ఓపెనింగ్ జోడి ఇచ్చిన ఆరంభానికి తన మెరుపులు జతచేశాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 89 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో స్టొయినిస్ 24 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 12వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతను ఆఖరి దాకా నిలిచాడు. మొయిన్ అలీ వేసిన 14వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన అతను మరుసటి ఓవర్ వేసిన సైనీ బౌలింగ్‌లో డోస్ పెంచాడు. 6, 4, 4తో 17 పరుగులు పిండుకున్నాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించగా డీప్ మిడ్‌వికెట్ వద్ద చహల్ క్యాచ్‌ను జారవిడిచాడు. మళ్లీ 17వ ఓవర్ సైనీ వేయగా... స్టొయినిస్ 4, 6తో తన జోరు కొనసాగించాడు.
ఆడింది... కోహ్లి ఒక్కడే!
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు శుభారంభమైనా కావాలి. లేదంటే టాప్–3 బ్యాట్స్‌మెన్ బాధ్యతగా ఆడాలి. కానీ ఈ మ్యాచ్‌లో బెంగళూరు వైపు నుంచి ఈ రెండూ జరగలేదు. దేవ్‌దత్ (4) ఔట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రబడ చేతిలో ఓ సారి, ధావన్ చేతిలో మరోసారి క్యాచ్‌లు నేలపాలైనా సద్వినియోగం చేసుకోలేకపోయిన ఫించ్ (13) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ‘మిస్టర్ 360’ డివిలియర్స్ (9) సింగిల్ డిజిట్‌కే ఔట్ కావడంతో 43 పరుగులకే బెంగళూరు 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ ముగ్గురు ఔటయినా క్రీజులో కోహ్లి ఉన్నాడన్న ధీమా కాసేపు ఉన్నా... అవతలివైపు మొయిన్ అలీ (11)లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా తేలిగ్గా వికెట్ పారేసుకోవడంతో బెంగళూరు పరాజయం ఖాయమైంది. కుదురుగా ఆడిన కోహ్లిని బోల్తా కొట్టించిన రబడ తన వరుస ఓవర్లలో వాషింగ్టన్ సుందర్ (17), దూబే (11), ఉదాన (1)లను పెవిలియన్ చేర్చాడు.
అశ్విన్ మన్కడింగ్ చేయలేదు
గత సీజన్‌లో రాజస్తాన్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను అశ్విన్ మన్కడింగ్ చేశాడు. ఇది పెద్ద చర్చకే దారి తీసినా... అశ్విన్ మాత్రం నిబంధనల ప్రకారమే చేశానని గట్టిగా వాదించాడు. ఈ మ్యాచ్‌లోనూ తన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 3)లోనే ఓపెనర్ ఫించ్‌ను మన్కడింగ్ చేసే అవకాశమున్నా... ఎందుకనో తనను తాను సముదాయించుకొని ఫించ్‌ను వెనక్కి రప్పించాడు తప్ప వికెట్లను గిరాటే వేయలేదు.
కోహ్లి @ 9000
టి20 క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఏడో క్రికెటర్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి గుర్తింపు పొందాడు. తన 271వ టి20 మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో గేల్ (13,296 పరుగులు–396 మ్యాచ్‌లు), పొలార్డ్ (10,345–461 మ్యాచ్‌లు), షోయబ్ మాలిక్ (9,926–365 మ్యాచ్‌లు), బ్రెండన్ మెకల్లమ్ (9,922–364 మ్యాచ్‌లు), వార్నర్ (9,391–285 మ్యాచ్‌లు), ఫించ్ (9,140 పరుగులు–285 మ్యాచ్‌లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 42; ధావన్ (సి) అలీ (బి) ఉదాన 32; శ్రేయస్ (సి) దేవ్‌దత్ (బి) అలీ 11; పంత్ (బి) సిరాజ్ 37; స్టొయినిస్ (నాటౌట్) 53; హెట్‌మైర్ (నాటౌట్) 11;
ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 196.
వికెట్ల పతనం: 1–68, 2–82, 3–90, 4–179. బౌలింగ్: ఉదాన 4–0–40–1, సుందర్ 4–0–20–0, సైనీ 3–0–48–0, చహల్ 3–0–29–0, సిరాజ్ 4–0–34–2, మొయిన్ అలీ 2–0–21–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవదత్ (సి) స్టొయినిస్ (బి) అశ్విన్ 4; ఫించ్ (సి) పంత్ (బి) అక్షర్ 13; కోహ్లి (సి) పంత్ (బి) రబడ 43; డివిలియర్స్ (సి) ధావన్ (బి) నోర్జే 9; మొయిన్ అలీ (సి) హెట్‌మైర్ (బి) అక్షర్ 11; సుందర్ (సి) అశ్విన్ (బి) రబడ 17; శివమ్ దూబే (బి) రబడ 11; ఉదాన (సి) శ్రేయస్ (బి) రబడ 1; సైనీ (నాటౌట్) 12; సిరాజ్ (బి) నోర్జే 5; చహల్ (నాటౌట్) 0;
ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–20, 2–27, 3–43, 4–75, 5–94, 6–115, 7–118, 8–119, 9–127. బౌలింగ్: రబడ 4–0–24–4, నోర్జే 4–0–22–2, అశ్విన్ 4–0–26–1, అక్షర్ పటేల్ 4–0–18–2, హర్షల్ పటేల్ 4–0–43–0.
Comments
Please login to add a commentAdd a comment