న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్‌కు కోర్టులోనూ చుక్కెదురైంది. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 37 ఏళ్ల సుశీల్ భారత్ తరఫున 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం... 2010 ప్రపంచ చాంపియన్ షిప్‌లో స్వర్ణం... 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లలో స్వర్ణం... 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు.
దర్యాప్తునకు సహకరిస్తాం...
బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుశీల్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా హాజరయ్యారు. ‘సదరు ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు మొత్తం నాకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణిలో సాగుతోంది. విచారణ ముగిసేవరకు నేను సహకరించి వాస్తవాలు ఏమిటో చెబుతా. బాధితుల స్టేట్‌మెంట్‌లు ఇప్పటికే రికార్డు చేశారు. ఘటన జరిగిన స్థలం వద్ద నాకు సంబంధించిన ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు.
అక్కడ జరిగినట్లుగా చెబుతున్న కాల్పులతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులకు లభించిన తుపాకీ, వాహనం నావి కావు. ఇలాంటి స్థితిలో నన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని సుశీల్ తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నాడు. గొడవ సమయంలో అక్కడే ఉన్న సోనూ అనే వ్యక్తి రౌడీషీటర్ అని... తనతో విభేదాలు ఉన్న సోనూ నుంచి సుశీల్‌కు హాని జరిగే అవకాశం కూడా ఉందని లుథ్రా వాదించారు.
సాక్ష్యాలు బలంగా ఉన్నాయి...
అయితే నిందితుడి తరఫు వాదనతో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ విభేదించారు. ‘సుశీల్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. చేతిలో కర్రతో అతడు కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తం ఘటనలో అతనే ప్రధాన నిందితుడు. దాడి చేయడంలో అతనిదే కీలకపాత్ర. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా నేరం చేయడంలో సుశీల్ చురుగ్గా పాల్గొన్నాడని నిర్ధారించారు. కేసులో వాస్తవాలు వెలికితీయాలంటే సుశీల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి.
అతను దేశం విడిచి వెళ్లి పారిపోకుండా ఇప్పటికే పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వాదించారు. దీనిని అంగీకరిస్తూ న్యాయమూర్తి బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు ఇంకా అరెస్టు కాలేదు. సుశీల్‌పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఇలాంటి స్థితిలో ముందస్తు బెయిల్ కుదరదు’ అని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 302 (హత్య) సహా ఐపీసీ, ఆయుధాల చట్టంలోని 11 వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ముందస్తు బెయిల్ కుదరదు
రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత
Published Tue, May 18 2021 6:26 PM | Last Updated on Wed, May 19 2021 1:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment