పాకిస్తాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని మాజీ పేసర్ వహాబ్ రియాజ్ అన్నాడు. అయితే, అనూహ్య రీతిలో ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వాపోయాడు.
అయినప్పటికీ ఈ విషయంలో తాను ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌లో గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే.
నాలుగేళ్ల కాలంలో ఏకంగా ఆరుగురు చీఫ్ సెలక్టర్లుగా వ్యవహరించారు. హరూన్ రషీద్, షాహిద్ ఆఫ్రిది, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ వసీం, మిస్బా ఉల్ హక్, వహాబ్ రియాజ్ ఈ జాబితాలో ఉన్నారు.
అయితే, ఎవరి హయాంలోనూ పాక్ జట్టు అంత గొప్ప అద్భుతాలేమీ సాధించలేకపోయింది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాలు చవిచూసింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపైనా ఆ జట్టు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వహాబ్ రియాజ్ వ్యవహారశైలి పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఒకప్పటి సహచర ఆటగాడు మహ్మద్ ఆమిర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం, ఇమాద్ వసీం రీఎంట్రీ తదితర విషయాల్లో వహాబ్‌పై విమర్శలు వచ్చాయి.
ఇక టీ20 ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో అమెరికా చేతిలో పాక్ ఓటమికి ఆమిర్(సూపర్ ఓవర్లో 18 పరుగులు ఇచ్చాడు) కారణం కావడంతో విమర్శల పదును పెరిగింది.
ఈ క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ సైతం వహాబ్ రియాజ్ సహా సెలక్షన్ కమిటీలో భాగమైన అబ్దుల్ రజాక్‌పై కూడా వేటు వేసింది. వీళ్లిద్దరిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది.
ఈ విషయంపై స్పందించిన వహాబ్ రియాజ్ చీఫ్ సెలక్టర్‌గా తన పనిని సక్రమంగానే నిర్వర్తించానని పేర్కొన్నాడు. అంతర్గతంగా ఎన్నో జరిగాయన్న రియాజ్.. అయితే, వాటి గురించి ప్రస్తావన అనవసరమని, బ్లేమ్ గేమ్స్‌కు తాను దూరంగా ఉంటానని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
లక్షన్ కమిటీని సంప్రదించిన తర్వాతే తాను నిర్ణయాలు తీసుకున్నానని.. అయినా తానొక్కడిదే తప్పన్నట్లుగా ప్రచారం సరికాదని పేర్కొన్నాడు. ఏదేమైనా గ్యారీ కిర్‌స్టన్(హెడ్ కోచ్) వంటి దిగ్గజాలతో పని చేయడం సంతోషంగా ఉందన్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వహాబ్ రియాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లూ వస్తున్న విషయం తెలిసిందే. ఏదేమైనా పాక్ క్రికెట్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment