న్యూఢిల్లీ: 'ద వాల్'గా సుపరిచితుడైన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్వతాహాగా మృదు స్వభావి అయిన విషయం అందరికీ తెలిసిందే. మైదానంలో అతను ఎంత శాంతంగా ఉంటాడో యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లారా చూసింది. అరివీర భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి శాంతికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా వ్యవహరించాడు. అయితే ఈ మిస్టర్ కూల్‌కు కూడా ఓ సందర్భంలో విపరీతమైన కోపం వచ్చింది. అది చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా చాలా మంది క్రికెటర్లు భయభ్రాంతులకు గురయ్యారు.
Never seen this side of Rahul bhai 🤯🤣 pic.twitter.com/4W93p0Gk7m
— Virat Kohli (@imVkohli) April 9, 2021
ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని, అతనిలోని ఈ యాంగిల్‌ను చూసి అవాక్కయ్యానని కోహ్లి ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా, ద్రవిడ్‌కు అంతలా కోపం తెప్పించిన ఘటన ఏమైవుంటుందని ఆలోచిస్తున్నారా. ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా ఓ యాడ్(CRED) కోసం ద్రవిడ్ చేసిన యాక్టింగ్ మాత్రమే. ఈ యాడ్‌లో నటుడు జిమ్ షరబ్ మాట్లాడుతూ.. క్రెడ్‌లో క్రెడిట్ కార్డు బిల్ కడితే... క్రెడ్ కాయిన్స్ వస్తాయని, వాటితో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డులు పొందొచ్చని చెప్తాడు. వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉందని, రాహుల్ ద్రవిడ్‌ను ముక్కోపి అన్న చందంగా ఉందని ఆయన అంటాడు.
ఆతరువాత ద్రవిడ్ ఫ్రేమ్‌లోకి వస్తాడు. కోపంతో ఊగిపోతూ కనిపించే అతను.. ఇతరులపై గట్టిగా అరుస్తూ, బ్యాట్‌తో కారు అద్దాలు పగలగొడుతూ కనిపిస్తాడు. అంతటితో ఆగకుండా నేను ఇందిరానగర్ గూండాను అంటూ హల్‌చల్ చేస్తాడు. ద్రవిడ్ విశ్వరూపానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిస్టర్ కూల్‌ను ఇంతకోపంగా ఎప్పుడూ చూడలేదని క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment