మార్క్‌ వుడ్‌కు గాయం.. ఇంగ్లండ్‌ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్‌ బౌలర్‌ | England Call Up Josh Hull After Mark Wood Ruled Out Of Sri Lanka Series | Sakshi
Sakshi News home page

మార్క్‌ వుడ్‌కు గాయం.. ఇంగ్లండ్‌ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్‌ బౌలర్‌

Published Sun, Aug 25 2024 3:20 PM | Last Updated on Sun, Aug 25 2024 3:38 PM

England Call Up Josh Hull After Mark Wood Ruled Out Of Sri Lanka Series

శ్రీలంకతో తాజాగా ముగిసిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ గాయం బారిన పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వుడ్‌  మూడో రోజు నుంచి బౌలింగ్‌ చేయలేదు. వుడ్‌ స్థానంలో ఇంగ్లండ్‌ సెలెక్టర్లు 20 ఏళ్ల యువ ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హల్‌ను ఎంపిక చేశాడు. హల్.. శ్రీలంకతో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ జట్టులో సభ్యుడిగా ఉంటాడు. 

కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌కు ఆడే హల్‌కు భీకరమైన ఫాస్ట్‌ బౌలర్‌గా పేరుంది. 6 అడుగుల 7 అంగుళాలు ఉండే హల్‌కు అతని ఫైట్‌ చాలా పెద్ద అడ్వాంటేజ్‌. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో హల్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. లార్డ్స్‌ వేదికగా శ్రీలంకతో రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 29 నుంచి మొదలవుతుంది. మూడో టెస్ట్‌ సెప్టెంబర్‌ 6 నుంచి 10 వరకు కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా జరుగనుంది.

కాగా, ఓల్డ్‌ ట్రఫర్డ్‌ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ధనంజయం డిసిల్వ (74), మిలన్‌ రత్నాయకే (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. జేమీ స్మిత్‌ (111) సెంచరీతో కదంతొక్కడంతో 358  పరుగులు చేసింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. కమిందు మెండిస్‌ (113) సెంచరీతో రాణించడంతో 326 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement