ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత్ అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులందరూ అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లని బోల్తా కొట్టించిన తీరు చూస్తే అశ్విన్ కి తగ్గ వారసుడు దొరికాడని అతనిని అభినందించకుండా ఉండలేరు.
చెపాక్‌లో జరిగిన రెండో టీ20లో వరుణ్ సత్తాచాటాడు. వరుణ్ చక్రవర్తి దేశవాళీ పోటీలలో తమిళ నాడు కి ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణ్ కి అశ్విన్ అభిమాన స్పిన్ బౌలర్ కావడమే కాక అతని నుంచే స్పిన్ బౌలింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.
కర్ణాటక నుంచి చెన్నై కి..
వరుణ్ పుట్టింది కర్ణాటకలోని బీదర్‌లో అయినప్పటికీ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. చెన్నై లోని సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో బ్యాచలర్ డిగ్రీ పొందాడు.
25 సంవత్సరాల వయసులో క్రికెట్‌ను కెరీర్ గా ఎంచుకొని ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. కొద్దిగా ఆలస్యంగా క్రికెట్ లోకి వచ్చినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో సాధన చేసి అనతికాలంలోనే దేశంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ కి మెళకువలు దిద్దుకొని దేశంలోనే ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా పేరు గడించాడు.
వరుణ్ ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ వ్యూహం?
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై గట్టి దెబ్బతీసాడు. రెండో టీ20లో 38 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఎత్తు కూడా వరుణ్ కి బాగా కలిసి వచ్చింది.
వరుణ్ బౌలింగ్ తీరు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ను సైతం ఆకట్టుకుంది. వరుణ్ ని వాన్ "అందమైన మిస్టరీ స్పిన్నర్" గా అభివర్ణించడం విశేషం. వరుణ్ ఇతర స్పిన్నర్ల లాగా బంతి ని ఎక్కువగా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ నిలకడ ఉంటుంది. స్టంప్స్ ని గురిపెట్టి చాలా స్థిరంగా, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. వరుణ్ చక్రవర్తిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు సరైన వ్యూహాన్ని రూపొందించాలి.. లేకపోతే అతను ఇంగ్లండ్ కి చాల ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని, హెచ్చరిక కూడా చేసాడు.
భారత్ కి కొత్త ఆశలు
వరుణ్ భారత్ తరుఫున 2021లో టి20 మ్యాచ్ ల్లో రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి 15 టి20 లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కతాలోని తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పటికీ, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు, ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
మొత్తానికి ఆస్ట్రేలియాలో చతికిలపడి నిస్తేజంగా ఉన్న భరత్ జట్టుకి వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో కొత్త ఊపిరి పోసాడు. అయితే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకో లేకపోవడం బాధాకరం. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత్ సెలెక్టర్లు సరైన రీతిలో ప్రోత్సహిస్తే జట్టుకి అశ్విన్ వంటి ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ లేని కొరత కొంతవరకైనా తీరుతుంది.
చదవండి: తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం
Comments
Please login to add a commentAdd a comment