ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్‌లు జరిగినా, వాటిల్లో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్' బాల్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనాలని చాలా మంది భారత క్రికెటర్లు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఓ క్రీడా ఛానెల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా టీమిండియా క్రికెటర్లు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు చాలా ఇష్టపడతారని, అక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని అన్నారు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఆయా లీగ్‌లకు అదనపు ఆకర్షణ వస్తుందని, దాంతో వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే, కొన్ని లీగ్‌ల వల్ల్ల ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ క్రికెట్ టోర్నీల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయని పేర్కొన్నాడు. దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని ఆయన కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు క్రికెట్ ఫార్మాట్ల మధ్య పెద్ద తేడా లేకుండా పోయిందని, దేనికి దక్కాల్సిన ప్రాధాన్యత దానికి దక్కడం లేదని ఆయన వాపోయాడు.
అయితే, టీ20 క్రికెట్ యువ క్రికెటర్లకు బాగా ఉపయోగపడుతుందని, వారి కెరీర్ బిల్డప్ చేసుకునేందుకు ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్ల పరిస్థితి ఇందుకు భిన్నమని.. ఈ ఫార్మాట్లలో ఆడటాన్ని ప్రధాన క్రికెటర్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, వంద బంతుల క్రికెట్ లీగ్‌ను(ది హండ్రెడ్ లీగ్) ఇంగ్లాండ్ గతేడాదే నిర్వహించాలని భావించింది. కరోనా కారణంగా అది సాధ్యపడకపోవడంతో ఈ ఏడాది నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) భావిస్తోంది.
చదవండి: వైరల్ వీడియో: నేటి ధోని, నాటి ధోనితో ఏమన్నాడంటే..
Comments
Please login to add a commentAdd a comment