
Photo: IPL Website
ఐపీఎల్ మొదలైన తొలి సీజన్ నుంచి ఆర్‌సీబీ ప్రతీసారి ఫెవరెట్‌గానే కనిపిస్తుంది. మూడుసార్లు ఫైనల్ గడప తొక్కినప్పటికి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయితే యాదృశ్చికంగా ఆర్‌సీబీ ప్రతీ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో దారుణ ఆటతీరును కనబరచడం అలవాటుగా చేసుకుంది.
అదేంటో తెలియదు కానీ ముందు మ్యాచ్‌లో విజృంభించి ఆ తర్వాతి మ్యాచ్‌కే బొక్కబోర్లా పడడం ఆర్‌సీబీ నైజం. తాజా సీజన్‌లోనూ ఆర్‌సీబీకి ఆ పరిస్థితి ఎదురైంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 123 పరుగులకే ఆలౌటై 81 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. అయితే ఒక దశలో 95 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో ఆకాశ్ దీప్, డేవిడ్ విల్లేలు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్‌సీబీ పరువు నిలబడింది. లేకుంటే వంద పరుగులలోపే ఆలౌటై ఘోర పరాజయాన్నే మూటగట్టుకునేదే.
అయితే కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఇదే ఆర్‌సీబీ దూకుడైన ఆటతీరును ప్రదర్శించింది. 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. విరాట్ కోహ్లి 82 నాటౌట్, డుప్లెసిస్ 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబైపై చెలరేగిన వీరిద్దరు కేకేఆర్‌తో మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం జట్టును దెబ్బతీసింది. ఇవాళ ఆర్‌సీబీ ఆటతీరు చూసిన ఫ్యాన్స్.. ''ఎవరికి అర్థం కాని ఆర్‌సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు''అంటూ పేర్కొన్నారు.