Ind Vs Aus: Fans Troll Australia After 177 Runs All-out In 1st Test In Nagpur, Score Details - Sakshi
Sakshi News home page

IND Vs AUS: 'జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది'

Published Thu, Feb 9 2023 6:15 PM | Last Updated on Thu, Feb 9 2023 7:27 PM

Fans Troll What Happen Australia After 177 Runs All-out 1st Test Nagpur - Sakshi

IND Vs AUS 1st Test Day-1 Analysis.. నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన తొలిటెస్టు మొదటిరోజు ఆట ముగిసింది. మరి తొలి రోజు ఆట విషయానికి వస్తే..  టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. టీమిండియా బౌలర్ల దాటికి ఆసీస్‌ బ్యాటర్లు తోక ముడిచారు. ఆది నుంచి తమకు స్పిన్‌ బలహీనత ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు చివరకు అదే స్పిన్‌ ఉచ్చులో పడి బోల్తా కొట్టింది. రోజు మొత్తం తమ ఆటను ఆడలేక చేతులెత్తేసింది.

జడేజా, అశ్విన్‌ల స్పిన్‌ మాయాజాలానికి బెంబెలెత్తిన ఆసీస్‌ 177 పరుగులకే చాప చుట్టేసింది. జడేజా ఐదు వికెట్లతో టాప్‌ లేపగా.. అశ్విన్‌ మూడు వికెట్లు పంచుకున్నాడు. మరో రెండు పేసర్ల ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయితే ఆసీస్‌ను తక్కువకే ఆలౌట్‌ చేశామని టీమిండియా సంబరపడితే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులోనూ నాథన్‌ లియోన్‌ లాంటి టాప్‌క్లాస్‌ స్పిన్నర్‌ ఉన్నాడు.

ఏ క్షణమైనా అతను వికెట్లు తీయగల సమర్థుడు. పైగా ఒక్కసారి లయ అందుకున్నాడంటే అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. గతంలో నాథన్‌ లియోన్‌ టీమిండియా బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టినవాడే. ఆస్టన్‌ అగర్‌ను కాదని జట్టులోకి తీసుకున్న టాడ్‌ ముర్ఫే తన తొలి టెస్టులోనే కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ తీసి హెచ్చరికలు పంపాడు. లియోన్‌తో పాటు ముర్ఫే కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.కాకపోతే మన పిచ్‌లపై ఆడడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. రెండో రోజు ఆటలో జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తేనే టీమిండియా నిలదొక్కుకుంటుంది. లేదంటే ఆస్ట్రేలియా లాగే వికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.

తొలిటెస్టులో తొలిరోజు ఆట మాత్రమే ముగియడంతో మ్యాచ్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రావడం కరెక్ట్‌  కాదని తెలుసు. కానీ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ చేసిన వ్యాఖ్యలు తొలిరోజునే మాట్లాడుకునేలా చేశాయి. మ్యాచ్‌ ప్రారంభానికి ఒక్కరోజు ముందు స్మిత్‌ మాట్లాడుతూ.. ''ఈసారి టీమిండియా స్పిన్నర్లకు మా బ్యాటింగ్‌ పవరేంటో చూపిస్తాం..అశ్విన్‌ను ఉతికారేస్తాం.. జడేజాను చీల్చి చెండాడతాం.. లెఫ్ట్‌ హ్యాండర్లను దృష్టిలో పెట్టుకొని కావాలనే పిచ్‌ను కఠినంగా తయారు చేశారు.. వారికి మేమెంటో చూపిస్తాం'' అంటూ జబ్బలు చరుచుకున్నాడు.

కట్‌చేస్తే కోహ్లి ఇచ్చిన లైఫ్‌తో 37 పరుగులు చేసిన స్మిత్‌ జడేజా అద్భుత బంతికి పెవిలియన్‌ చేరాడు. బీరాలు పలికిన ఆసీస్‌ ఆటగాళ్ల నోటికి తాళం పడినట్లేనని కొంతమంది అభిమానులు కామెంట్స్‌ చేశారు. ''ఆటపై ఫోకస్‌ పెట్టాల్సింది పోయి డాక్టర్డ్‌ పిచ్‌.. ''అంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని రోహిత్‌ శర్మ చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. వారం క్రితమే ప్రాక్టీస్‌ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరంగా గొప్పలకు పోయింది. అలా కాకుండా స్పిన్నర్లు ఎదుర్కోవాల్సిన వాటిపై కసరత్తు చేసి ఉంటే బాగుండేది.

సాధారణంగా ఆసియాలోని ఉపఖండం పిచ్‌లు స్పిన్నర్లు బాగా అనుకూలిస్తాయని అందరికి తెలిసిందే. అయితే ఇప్పటివరకు మనం చూసిన టెస్టు సంప్రదాయంలో ఉపఖండంలో తొలి మూడు రోజులు ఏ పిచ్‌ అయినా బ్యాటింగ్‌కు అనుకూలంగా.. చివరి రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా తయారు చేయడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

నాగ్‌పూర్‌ పిచ్‌ తొలిరోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. గింగిరాలు తిరుగుతున్న బంతిని ఆడేందుకు బ్యాటర్లు జంకుతున్నారు. మ్యాచ్‌లో తొలి రెండు వికెట్ల సీమర్లు పడగొట్టినప్పుడు పిచ్‌ మాములుగానే ఉంది అని అనుకుంటున్న కాసేపటికే మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. ఎప్పుడెప్పుడు వికెట్లు తీద్దామా అని వేచి చూస్తున్న జడేజా, అశ్విన్‌లు వికెట్ల వేట మొదలుపెట్టారు. చూస్తుండగానే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 177 పరుగుల వద్ద ముగిసిపోయింది.

చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!'

 'అందరూ మీలా షార్ప్‌గా ఉండరు'.. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌కు చురకలు

జడేజా దెబ్బకు స్మిత్‌ మైండ్‌ బ్లాంక్‌.. వీడియో చూసి తీరాల్సిందే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement