స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై వృద్ధిమాన్ సాహా సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనను ఇకపై ఎంపిక కోసం పరిగణించనందున "రిటైర్మెంట్" గురించి ఆలోచించమని సలహా ఇచ్చినట్టు సాహా తెలిపాడు. కాగా శ్రీలంకతో టెస్టులకు జట్టు ఎంపికలో సాహాను పరిగణినలోకి తీసుకోవడం లేదని ముందే అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అతడు రంజీ ట్రోఫీ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
"ఇక నుంచి జట్టు ఎంపికలో నన్ను పరిగణించబోమని టీమ్ మేనేజ్‌మెంట్ నాకు చెప్పింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నాకు రిటైర్మెంట్ గురించి ఆలోచించమని సూచించాడు. గత నవంబర్‌లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో నేను పెయిన్ కిల్లర్ మాత్రలు తీసుకుని అజేయంగా 61 పరుగులు చేసినపుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నన్ను అభినందించారు. బీసీసీఐ అధ్యక్షుడుగా తను ఉన్నంత కాలం జట్టులో నా స్ధానం గురించి ఆందోళన చెందవద్దని గంగూలీ నాకు హామీ ఇచ్చారు. బోర్డు అధ్యక్షుడి నుంచి అటువంటి భరోసా రావడంతో నేను చాలా సంతోష పడ్డాను. అయితే ఇంతలోనే జట్టులో స్ధానాన్ని ఎలా కోల్పోయానో నాకు అర్ధం కావడం లేదు" అని సాహా పేర్కొన్నాడు.
చదవండి: "త్వరలోనే భారత జట్టులోకి వస్తా.. నా విజయంలో అతడిదే కీలక పాత్ర"
Comments
Please login to add a commentAdd a comment