
దుబాయ్: భవిష్యత్‌లో జరగబోయే టోర్నీల నిర్వహణ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్–ఎఫ్‌టీపీ), క్రికెట్‌ను మరిన్ని దేశాల్లో అభివృద్ధి చేసే అంశాలపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బోర్డు నేడు సమావేశం కానుంది. టి20 ప్రపంచ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే ముందు తమకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరిన నేపథ్యంలో కీలక ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. జూలై 1 తర్వాత బీసీసీఐ వరల్డ్ కప్ విషయంలో స్పష్టతనిచ్చిన తర్వాతే ఐసీసీ స్పందించే అవకాశం ఉంది.
కాబట్టి జూలై 18 నుంచి జరిగే ఐసీసీ తదుపరి సమావేశంలోనే వరల్డ్ కప్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇతర అంశాలే అజెండాగా ఐసీసీ సమావేశం సాగవచ్చు. 2023–2031 మధ్య ఎనిమిది సంవత్సరాల కాలంలో నిర్వహించబోయే ఐసీసీ టోర్నీలతో పాటు తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొనసాగింపు సాధ్యాసాధ్యాలపై కూడా చర్చ జరుగుతుంది. క్రికెట్‌ను కనీసం 104 దేశాలకు విస్తరించాలని భావిస్తున్న ఐసీసీ... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కూడా మహిళల క్రికెట్‌ను చేర్చేందుకు ఉన్న అవకాశాలపై కూడా చర్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment