
Gautam Gambhir: Virat Kohli More Dangerous Batsman: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించిన నేపథ్యంలో విరాట్ కోహ్లి కేవలం టెస్టులకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినపుడే... వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని కోహ్లి ప్రకటించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒక్కరే సారథిగా ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి కోహ్లికి ఉద్వాసన పలికారు. ఈ విషయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కోహ్లికి మద్దతుగా కొంతమంది... సెలక్టర్ల నిర్ణయమే సరైంది అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కోహ్లి, టీమిండియా భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే పాత కోహ్లిని.. అతడి పరుగుల ప్రవాహాన్ని చూడబోతున్నామంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్' షోలో గంభీర్ మాట్లాడుతూ... కెప్టెన్సీ భారం లేనందున బ్యాటర్‌గా కోహ్లి మరింత గొప్పగా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు.
‘‘టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ పాత్ర ఎలాగో.. వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లి పాత్ర కూడా అలాగే. కేవలం తను కెప్టెన్‌గా ఉండబోడు అంతే. నిజానికి ఇది తనకు, జట్టుకు ఎంతో ప్రయోజనకరం. సారథ్య బాధ్యతల భారం నుంచి విముక్తి పొందినందున అతడు మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలడు. మరింత ప్రమాదకర బ్యాటర్‌గా మారతాడు’’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి!
దేశాన్ని గర్వపడేలా చేస్తాడు...
‘‘అతడు దేశాన్ని గర్వపడేలా చేస్తాడు. టీ20, వన్డే, టెస్టుల్లో పరుగుల వరద పారిస్తాడు. విరాట్ కోహ్లిలోని అత్యుత్తమ బ్యాటర్‌ను ఇండియా చూడబోతోంది. కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా.. తనలోని బ్యాటర్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాడు’’ అని కోహ్లిపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా రెండేళ్లుగా కోహ్లి ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. దీంతో అతడు ఎప్పుడెప్పుడు శతకం బాదుతాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ కల త్వరలోనే నెరవేరుతుందంటున్నాడు గంభీర్.
Comments
Please login to add a commentAdd a comment