షార్జా : ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మ్యాక్స్‌వెల్ 2014లో కింగ్స్ పంజాబ్ తరపున 552 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపీఎల్ వేలంలో ఎక్కువ ధర పలికేలా చేసింది. అంతేకాదు.. 2017లో మళ్లీ కింగ్స్ పంజాబ్ జట్టుకు మ్యాక్స్‌వెల్ కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వహించాడు. కానీ ఇప్పుడు అదే మ్యాక్స్‌వెల్‌ను కింగ్స్ పంజాబ్ వేలంలో రూ. 10.5 కోట్లు పెట్టి కొంటే ఐపీఎల్ 13వ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. (చదవండి : కోహ్లి బ్యాట్స్ దొంగలిస్తా : డివిలియర్స్)
అయితే మ్యాక్సీ ఐపీఎల్‌కు రాకముందు ఇంగ్లండ్ సీజన్‌లో తన ప్రదర్శనతో దుమ్మురేపాడు. వన్డే సిరీస్‌లో కీలక మ్యాచ్‌లో 90 బంతుల్లోనే 108 పరుగులు చేసి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. తీరా ఐపీఎల్‌కు వచ్చేసరికి మ్యాక్స్‌వెల్ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. కింగ్స్ పంజాబ్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన మ్యాక్సీ కేవలం 58 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు మాక్స్‌వెల్ స్థానంలో క్రిస్‌గేల్‌ను ఆడించాలని.. లేకపోతే పంజాబ్ తీవ్రంగా నష్టపోతుదంటూ సీనియర్లు విమర్శించారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మ్యాక్స్‌వెల్ తనకు పూర్తి క్లారిటీ ఉందని పేర్కొన్నాడు. (చదవండి : ఆ టోపీలకు విలువ ఇవ్వను: అశ్విన్)
'ఐపీఎల్, అంతర్జాతీయ కెరీర్‌ను ఎప్పుడూ పోల్చుకోకూడదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు నా పాత్రపై పూర్తి స్పష్టత ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎవరు ముందు.. ఎవరు వెనుక అనే దానిపై స్పష్టత ఉంటుంది. ఎందుకంటే అది జాతీయ జట్టు.. అందునా ప్రతీ మ్యాచ్‌లోనూ దాదాపు ఒకే జట్టును ఆడిస్తారు. కానీ ఐపీఎల్‌లో అలా ఉండదు. ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్ మారుతూ వస్తుంది. అందువల్లే నా ప్రదర్శనలో తేడా కనిపిస్తుంది. ప్రస్తుత పంజాబ్ జట్టులో మొదటి నాలుగు స్థానాల తర్వాతే నేను బ్యాటింగ్‌కు దిగుతున్నా.. ఇప్పటికైతే టాప్ ఆర్డర్‌లో ఆడే అవకాశం లేదు.. దీంతో ముందున్న నలుగురు బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా స్ట్రైక్ రొటేట్ చేయడమే నా పాత్ర. కానీ నేను ఇంత దారుణంగా ఆడుతానని అనుకోలేదు.
కానీ యూఏఈ పిచ్‌లు ప్రస్తుతం నెమ్మదిస్తున్నాయి. ఆసీస్ తరఫున మంచి ప్రదర్శన చేసిన అనంతరం ఇక్కడ అదే ప్రదర్శనను పునరావృతం చేయకపోవడం బాధ కలిగిస్తుంది. కానీ ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని.. గతంతో పోలిస్తే వికెట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని తెలిపాడు. చాలా మ్యాచుల్లో పంజాబ్ గెలుపు దగ్గరికొచ్చి ఓడిపోవడం బాధాకరమే.. అందకు నన్ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం మాత్రం ఒప్పుకోను.' అని చెప్పుకొచ్చాడు. కాగా పంజాబ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. ఇక ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్ పంజాబ్‌కు కీలకమనే చెప్పొచ్చు. గురువారం ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో క్రిస్ గేల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. (చదవండి : ‘ఈ సీజన్‌లో ఆ రెండు జట్లే అత్యుత్తమం’)
Comments
Please login to add a commentAdd a comment