
టి20 ప్రపంచకప్‌లో రెండో సెంచరీ నమోదైంది. సూపర్-12లో భాగంగా గ్రూఫ్-1లో శుక్రవారం శ్రీలంకతో మ్యాచ్‌లో కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ శతకంతో మెరిశాడు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు. డారిల్ మిచెల్‌ను ఒక ఎండ్‌లో నిలబెట్టి ఫిలిప్స్ స్ట్రైక్ రొటేట్ చేసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు.
ఓవరాల్‌గా 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్‌లో షనకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్‌లో ఫిలిప్స్ రెండో శతకం అందుకున్నాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో నాలుగో స్థానం లేదా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్ రికార్డులకెక్కాడు.
సెంచరీయే ఒక రికార్డు అనుకుంటే దానితో పాటు సిక్సర్ల రికార్డు కూడా అందుకున్నాడు. 2021 నుంచి టి20ల్లో ఫిలిప్స్ బాదిన సిక్సర్ల సంఖ్య 149(తాజా వాటితో కలిపి). ఈ నేపథ్యంలోనే 2021 నుంచి చూసుకుంటే అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గ్లెన్ ఫిలిప్స్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నాడు. లివింగ్‌స్టోన్ 152 సిక్సర్లు బాదాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే కివీస్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2 వికెట్ల పడగొట్టగా.. తీక్షణ, ధనంజయ, హసరంగ, లహిరు కుమార తలో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో భాగంగా శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసింది. భానుక రాజపక్ష (34), దసున్ శనక (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, సోధి తలో 2 వికెట్లు.. సౌథీ, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు.
చదవండి: T20 WC 2022 : కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్
Comments
Please login to add a commentAdd a comment